బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేశారుగా..!

బంగారం కాదు.. నగదు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేశారు.

బీహార్ దొంగలు సెల్ ఫోన్ టవర్‌నే దొంగలించేశారు. అవును నిజమే.. ఏళ్ల తరబడి అక్కడ ఉన్న టవర్ ఉన్నపళంగా మాయమైంది.
చిన్న వస్తువులు, నగదు, బంగారాన్ని దోచుకున్న కాలం పోయి..
ప్రస్తుతం ఏకంగా 132 అడుగుల ఎత్తున్న భారీ మొబైల్ టవర్‌నే మాయం చేశారు దొంగలు.
బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరంతరాయంగా టెలికాం సేవలను అందిస్తున్న ఒక పెద్ద మొబైల్ టవర్‌ను దొంగలు గుట్టుచప్పుడు కాకుండా విరగ్గొట్టి, ముక్కలు ముక్కలుగా చేసి తరలించేశారు.
కేవలం టవర్‌ను మాత్రమే కాకుండా, అక్కడ అమర్చిన భారీ జనరేటర్, దానికి సంబంధించిన ఇతర విలువైన టెలికాం సామగ్రిని కూడా దొంగలు వదలకుండా ఎత్తుకెళ్లడం గమనార్హం.
ఇటీవల సదరు టెలికాం కంపెనీ అధికారులు, సాంకేతిక సిబ్బంది నిరంతర నిర్వహణ పనుల కోసం ఆ సైట్ వద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ టవర్ లేకపోవడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు…ఇంకా స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మొబైల్ టవర్ చోరీ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది..

టెలికాం సంస్థ వెల్లడి..

బిహార్లోని బక్సర్ జిల్లాకు సమీపంలోని దుమ్రావ్ పట్టణంలో 2010లో ఓ ప్రైవేటు టెలికాం సంస్థ ఈ మొబైల్ టవర్(Telecom Tower)ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం స్థలం యజమాని హరేనాథ్ యాదవ్తో 12 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2022లో ఒప్పందం ముగిసిన తర్వాత కంపెనీ నుంచి అద్దె చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో స్థలం యజమాని పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ కంపెనీ నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది.

ఇటీవల మరమ్మతుల కోసం అక్కడికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు టవర్తో పాటు జనరేటర్ కూడా కనిపించకపోవడంతో షాకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం, టవర్ చాలా ఏళ్లుగా అక్కడే ఉండేదని, గత 15 నుంచి 20 రోజులుగా మాత్రమే కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, అవసరమైతే స్థలం యజమానిని కూడా ప్రశ్నిస్తామని పోలీసులు వెల్లడించారు.