నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటు వేదికగా లోతైన చర్చకు తాము సిద్ధమే… కేంద్ర మంత్రి జేపీ నడ్డా..

విద్యార్థుల నిరసనలతో రాజకీయాలు వద్దు..!

నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటు వేదికగా లోతైన చర్చకు తాము సిద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. పేపర్ లీక్ అంశం, విద్యార్థుల నిరసనలతో రాజకీయాలు వద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని అన్నారు. విద్యార్థుల డిమాండ్స్, సమస్యలతో రాజకీయం చేసి లాభం పొందేందుకు ప్రయత్నించడం తగదని మంత్రి జేపీ నడ్డా అన్నారు..

కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్ ఉదంతాలపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదని మంత్రి నడ్డా ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని అన్నారు. కేవలం ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోని అంశాలనే ఎందుకు ఎంచుకుంటున్నారని అన్నారు. 150 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయన్న రాహుల్ గాంధీ ఆరోపణపై కూడా మంత్రి స్పందించారు. ప్రతి కేసుపై దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు. ‘ఈ ఆరోపణలపై దర్యాప్తు జరగాలి. మాది బాధ్యతగల ప్రభుత్వం. కాబట్టి, అన్ని కేసులపై దర్యాప్తు చేసి నిజానిజాలను ప్రజల ముందు ఉంచుతాము’ అని నడ్డా అన్నారు..

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కౌంటర్: గత పదేళ్లలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు విచారణాంశమని, వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందుంచుతుందని జేపీ నడ్డా పేర్కొన్నారు..