అమరావతిని ఏపీ రాజధానిగా పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి , అమిత్ షా ను కోరిన సీఎం చంద్రబాబు..!

పోలవరం గ్యాప్‌-1లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్యాప్‌-2లో అప్‌స్ట్రీమ్‌, డౌన్‌స్ట్రీమ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పట్టిసీమ రాకుండా వైఎస్సార్సీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని అప్పుడు పట్టిసీమ నిర్మించకుంటే ఇవాళ రాయలసీమకు నీళ్లు వెళ్లేవి కాదు అన్నారు. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్లు వెడల్పు, ఎత్తుతో 2 టన్నెళ్లు వస్తాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయని తెలిపారు. విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువను బాగా వెడల్పు చేశామని, పోలవరం నీటితో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం – జీవనాడి అని సీఎం కొనియాడారు…

పోలవరం ప్రాజెక్టు పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు.

అలాగే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘జీ-రామ్-జీ’ పథకంలోని నిబంధనలపైనా చంద్రబాబు చర్చించారు. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం వల్ల, ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే తరహా మద్దతును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా ఇరువురు నేతలు సమీక్షించుకున్నారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959