దిల్లీలోని ఆకాశవాణి భవన్ సమీపంలో 25-30 మంది నిరసనకారులు ఇంతియాజ్ అలీ మార్గ్‌లోని బారికేడ్లపై నుంచి దూకి భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి..!
జంతర్ మంతర్ 2.0 నిరసనలకు ఇకపై అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ప్రకటించారు. తాము పోలీసుల నిర్బంధంలో ఉన్నంత కాలం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనలు, సీజేపీ ఇన్ఛార్జ్ అజింక్య శిందే నాయకత్వంలోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. “నన్ను అరెస్టు చేస్తారని ముందే ఊహించాను. అందుకే శుక్రవారం రాత్రి అజింక్య శిందే ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తాడని స్వయంగా చెబుతూ ఓ వీడియో రికార్డు చేశాను. అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్లు అజింక్య శిందేను అనుసరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా శనివారం తెలిపారు..
పోలీసుల నిర్బంధంలో దీప్కే
ముంబయి నుంచి దిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్తున్న అభిజీత్ దీప్కేను శనివారం విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరిని విమానాశ్రయం నుంచి నేరుగా ఓ అజ్ఞాత ప్రాంతానికి తరలించారు..
పోలీసులపై రాళ్ల దాడి.
మరోవైపు దిల్లీలోని ఆకాశవాణి భవన్ సమీపంలో 25-30 మంది నిరసనకారులు ఇంతియాజ్ అలీ మార్గ్‌లోని బారికేడ్లపై నుంచి దూకి భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. రాళ్లదాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని, తాము కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాస్తవానికి జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ పలువురు నిరసనకారులు వేర్వేరు ప్రదేశాల నుంచి జంతర్ మంతర్‌కు వచ్చే ప్రయత్నం చేశారు. దీనితో పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకోగా, మరికొందరిని వెనక్కు పంపించారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుత పరిస్థితులన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.