అమెరికా, యూకేల ఉమ్మడి ప్రతిష్ఠాత్మక సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణుల దాడి..!
అమెరికా, యూకేల ఉమ్మడి ప్రతిష్ఠాత్మక సైనిక స్థావరం డీగో గార్సియాపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి మధ్యలోనే కూలిపోగా, మరొకదానిని క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుకుని, ధ్వంసం చేశాయి..
అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనం ప్రచురించింది. బ్రిటన్ కూడా ఈ క్షిపణి దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించడం కొత్తేమీ కాకపోయినా ఏకంగా 4 వేల కిలోమీటర్ల దూరం వెళ్లే సామర్థ్యం ఉండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు తెలిసిన మేరకు ఇరాన్ క్షిపణుల గరిష్ఠ సామర్థ్యం 2 వేల కిలోమీటర్లే కావడం గమనార్హం. ఈ క్షిపణి దాడులతో పశ్చిమాసియాలోని యుద్ధం హిందూ మహాసముద్రానికీ విస్తరించినట్టేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా స్థావరం అత్యంత కీలకమైనది. అక్కడ అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక బీ-2 బాంబర్లు సహా అత్యాధునిక మిలిటరీ, రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల్లో ఖోరామ్షెహర్-4 క్షిపణి అత్యధికంగా 2 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదనే డేటా మాత్రమే ఉంది. అవి మొత్తం పశ్చిమాసియాతోపాటు తూర్పు యూర్పలోని కొన్ని దేశాల వరకు చేరుకోగలవని అంచనా. కానీ డీగో గార్సియాపైకి ప్రయోగంతో.. ఇరాన్ క్షిపణుల అసలు సామర్థ్యం ఎంత అనే చర్చ జరుగుతోంది. భారతదేశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న డీగో గార్సియా దీవి (చాగోస్ ఐలాండ్స్లో భాగం) ఇరాన్ నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ క్షిపణి అక్కడి వరకు చేరుకుందంటే.. అది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్బీఎం) అని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఈ క్షిపణి అటు బ్రిటన్లోని లండన్ వరకు చేరుకోగలదని, చాలా వరకు యూరప్ దేశాలపై దాడి చేయగలదని అంటున్నారు. నిజానికి ఇరాన్ ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాల్లో పురోగతి సాధించింది. రాకెట్లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఆ రాకెట్ సాంకేతికతలను వినియోగించుకుని.. 4, 5 వేల కిలోమీటర్లకుపైగా సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణులను (ఐసీబీఎం)లను ఇరాన్ అభివృద్ధి చేస్తోందని అమెరికా గతంలోనే పేర్కొంది కూడా…