రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో తలెత్తే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి..

రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో తలెత్తే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కీలకమైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ సమయంలో అనుసరించిన వ్యూహం తరహాలోనే ఎల్ నినోపైనా ఒక పటిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే జూన్ వరకు పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు..ఈ భేటీలో తాగు, సాగునీటి సమస్యలతో పాటు విద్యుత్ రంగంపై పడబోయే ప్రభావం గురించి సీఎం తీవ్రంగా చర్చించారు. విద్యుత్ కొరత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని, బహిరంగ మార్కెట్లో తగినంత విద్యుత్ అందుబాటులో లేనందున ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, అందుబాటులో ఉన్న కరెంట్‌ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని, వ్యవసాయేతర లేదా విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తే మంచిదని సూచించారు..

గతంలో వచ్చిన కోవిడ్ సంక్షోభాన్ని ఏ రకంగా ఎదుర్కొన్నామో, అదే తరహా పకడ్బందీ ప్రణాళికతో ఎల్‌నినో సవాలును కూడా దాటాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో నీటి సమస్య జటిలం కాకుండా ముందుజాగ్రత్త పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

అధికారులకు దిశానిర్దేశం..

ఈ పోరాటంలో ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడమే అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎల్‌నినో ప్రభావంపై విస్త్రతంగా అవగాహన కల్పించాలన్నారు. సినిమాలు, మీడియా, కళాజాతాలు , ఇతర సామాజిక మాధ్యమాలను ఉపయోగించి నీరు, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.