సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్..
సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన క్రమంలో ముందస్తు జాగ్రత్తగా ఆయనను అరెస్ట్ చేశారు. విమానంలో ఢిల్లీకి వస్తుండగా.. ఫ్లైట్ లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనపై శనివారం భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలో ఓటర్ల జాబితా అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కుమార్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించడానికి పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో ఈ అరెస్టులు జరిగాయి.
పోలీసుల చర్యతో పాటు, జాతీయ రాజధాని అంతటా ట్రాఫిక్ మళ్లింపులు, మెట్రో సర్వీసులపై ఆంక్షలు, రైళ్ల రద్దు, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వంటి విస్తృత భద్రతా ఆంక్షలు విధించారు..
రాజధానిని అష్టదిగ్భంధనం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర 7 అంచెల భారీ బారికేడ్లు ఏర్పాటు చేయగా.. సున్నిత ప్రాంతాల్లో 300 పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను కట్టడి చేయడానికి పోలీసుల పకడ్బందీ ప్రణాళికలు వేశారు. సాధారణ దుస్తుల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించారు..
ఇవాళ్టి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు మూసివేశారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే 250 పైగా రైళ్లు రద్దు చేశారు. జన్పథ్-కర్తవ్య మార్గ్ చుట్టూ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. సెంట్రల్ ఢిల్లీకి 4 కి.మీ. పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా.. హోటళ్లు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అలాగే CJP ఆందోళనలతో నిన్న, ఇవాళ మద్యం దుకాణాలు ఢిల్లీలో పూర్తిగా బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిరసనలో పాల్గొనవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేయగా.. మహిళా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పింక్ ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గతంలో కేసులు ఎదుర్కొన్న వారిని ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు.