భరించలేని ఎండ.. మరెక్కడో కుండపోత.. ఇంకొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరవు. ఇప్పుడు ఈ పరిస్థితులను మరింత తీవ్రం చేసే ఒక ప్రకృతి పరిణామం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది…2026లో మొదలైన ఈ ఎల్‌నినో ప్రభావం గతంలో ప్రపంచాన్ని వణికించిన 1997 నాటి రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందని NASA శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించబోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఎల్‌నినో మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది?…
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. ఈ పరిస్థితినే ఎల్‌నినో అంటారు. సముద్రంలో మొదలయ్యే ఈ ఉష్ణోగ్రతల మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశను, వర్షపాతాన్ని, వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది…దీనికారణంగా కొన్ని ప్రాంతాల్లో కరవు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల తీవ్రమైన వేడిగాలులు ఏర్పడవచ్చు. గతంలో 1997-98, 2015-16 సంవత్సరాల్లో నమోదైన ఎల్‌నినో పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి…NASA అక్టోబర్ పరిశీలనల్లో 1997 నాటి ఎల్‌నినోతో పోలిన పరిస్థితులు కనిపించాయి. పశ్చిమ పసిఫిక్‌లో సముద్ర మట్టాలు తగ్గడం, తూర్పు ప్రాంతంలో పెరగడం, దక్షిణ అమెరికా వైపు అసాధారణంగా వేడినీరు విస్తరించడం లాంటి మార్పులు నమోదయ్యాయి. NOAA నవంబర్ 12న విడుదల చేసిన అంచనాలో ఈ ఎల్‌నినోను అత్యంత బలమైన కేటగిరీగా వర్గీకరించింది. 1950 తర్వాత ఇంతటి తీవ్రత నమోదైన సందర్భాలు మూడే ఉన్నాయి.
1982-83, 1997-98, 2015-16. 2027 ప్రారంభంలో కూడా ఈ పరిస్థితులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రభావాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వాతావరణానికే పరిమితం కావడం లేదు. మన ఆరోగ్యంపైనా తీవ్ర పరిణామాలు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నాయి. మొదటిది తీవ్రమైన వేడిగాలులు. ఉష్ణోగ్రతలు పెరిగితే వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. రెండోది గాలి కాలుష్యం. అడవుల్లో కార్చిచ్చులు పెరిగితే పొగ, సూక్ష్మ ధూళి కణాలు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా వంటి ఇబ్బందులను తీవ్రతరం చేయవచ్చు. మూడోది అంటువ్యాధుల ముప్పు. వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల దోమలు వ్యాప్తి చెందే పరిస్థితులు మారవచ్చు. దీంతో డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల ముప్పు కొన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంటుంది…