వడగాల్పులు వీచే అవకాశాలు…అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్
గుంటూరు జిల్లాలో 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందని, ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. వడగాల్పులకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంబంధించి అధికారులు ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు.