మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా..!

మరోసారి వీకెండ్ కూల్చివేతలు చేపట్టిన హైడ్రా

హైకోర్టు మొట్టికాయలు వేసి, ఆదేశాలిచ్చినా పట్టించుకోని హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఉన్న కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో రెంటుకు ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి, రెండు జేసీబీలు, రెండు ప్రోక్లేనర్లతో కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది

పెద్ద సంఖ్యలో మోహరించిన హైడ్రా సిబ్బంది మరియు పోలీసులు

భవనంలోని 45 ఫ్లాట్లలో రెంటుకు ఉన్న కుటుంబాలు

ఉన్నపళంగా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్లాలి.. ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో ఉన్న రెంటర్స్

నాదర్ గుల్ భూముల విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని హైడ్రా

బీఆర్ఎస్ సాక్షాధారాలతో సహా బయటపెట్టినా చర్యలు తీసుకోని హైడ్రా

కోకాపేటలో ప్రభుత్వ భూమిలో మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ ను పట్టించుకోని హైడ్రా..

హైదరాబాద్‌ శివారులోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హైడ్రా) మరోసారి రంగంలోకి దిగింది. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో భారీ కూల్చివేతలు చేపట్టింది. సుమారు 2,000 మంది రెవెన్యూ, హైడ్రా సిబ్బంది, 1,000 మందికి పైగా పోలీసుల బందోబస్తు మధ్య ఈ మెగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐలాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని అధికారులు భారీ యంత్రాలతో నేలమట్టం చేశారు. దీనితో పాటు 1998 నుంచి కోర్టు స్టే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన న్యాయవాది ముఖీంకు చెందిన గెస్ట్‌ హౌస్‌ను కూడా అధికారులు కూల్చివేశారు. ఈ ఆపరేషన్‌తో కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టింది. మరోవైపు, కిష్టారెడ్డిపేటలోని కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్‌ డెవలపర్స్‌ భవనాల్లో నివసిస్తున్న 45 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమను బలవంతంగా బయటకు పంపుతున్నారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందిస్తూ, పేదలు నివసించే ఇళ్లను తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించి నిర్మించిన వాణిజ్య, పెద్ద కట్టడాలపైనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజాం కాలం నాటి సుమారు 1,260 ఎకరాల ఇనాం భూములను కబ్జాదారుల నుంచి కాపాడటమే ఈ ఆపరేషన్‌ లక్ష్యమని, దీని విలువ మార్కెట్‌లో రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకున్న భూమికి త్వరలోనే ఫెన్సింగ్‌ వేస్తామని అధికారులు వెల్లడించారు…