సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వివాదంలో మంత్రి కొండా సురేఖపైన, అలాగే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై విమర్శలు చేసిన సీనియర్ నేత ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ టీపీసీసీ చీఫ్ బీ.మహేశ్ కుమార్ గౌడ్ కు నివేదిక సమర్పించింది. చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మొహన్ నివేదిక సమర్పించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారానికి సంబంధించి నివేదికలో కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ విధి విధానాలు, అగ్రనేతల తీరుపై అసంతృప్తిని బహిరంగ వేదికలపై.. వ్యక్తపరుస్తూ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేతలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోబోతోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్గా చిన్నారెడ్డిని ఊపేక్షించడానికి వీల్లేదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికలో పొందుపర్చడమైనది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ప్రకారం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని..చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ పదవి నుండి తప్పించాలని పేర్కొంది. వీళ్లిద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది. దీనిపై చర్చించేందుకు.. తదుపరి చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి రేవంత్ రెడ్డిని కలిసి తుదినిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్సుంది.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి పట్ల టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను కమిటీ క్షమించరానివిగా భావిస్తోంది. అలాగే వారం రోజుల క్రితం చిన్నారెడ్డి కూడా ఇదే తరహాలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కామెంట్స్ చేయడాన్ని కూడా తప్పుగానే భావిస్తోంది. ఇందులో భాగంగానే కొండా సురేఖకు మంత్రి పదవి తొలగించాలని … చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైఎస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని పేర్కొంటూ ఓ నివేదికను తయారు చేసింది. ఈ ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని క్రమశిక్షణ కమిటీ నివేదిక ద్వారా పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు.