గోదావరి నదీ జలాల వినియోగంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. రెండు రోజుల క్రితం దేవాదుల వేదికగా సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ప్రకటించారు…
గోదావరి మీద చర్చకు మేం సిద్ధం. ఎంత సేపన్నా మాట్లాడుదాం. ఎన్ని రోజులైనా మాట్లాడ్తాం. కానీ, కెమెరా తిప్పొద్దు. మైక్ కట్ చేయొద్దు. అందుకు నువ్వు సిద్ధమా’ అని హరీశ్‌రావు సీఎం రేవంత్‌కు ప్రతిసవాల్ విసిరారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాసర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్, పార్టీ నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్లు సాంబారి సమ్మారావు, సుధీర్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, టీ రమేశ్‌బాబు, హరిరమాదేవి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నదీ జలాలపై రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేకించి నీటివాటాపై రేవంత్‌రెడ్డి నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ నీళ్లు పారిస్తే.. రేవంత్ కన్నీళ్లు పెట్టిస్తున్నడు
రైతుల పంట పొలాలకు కేసీఆర్ నీళ్లు పారించడం ప్యాషన్ అయితే, దురదృష్టవశా త్తు రైతుల కండ్లల్లో నీళ్లు పారించడం రేవంత్‌కు ప్యాషన్ అయిపోయిందంటూ హరీశ్‌రావు ధ్వ జమెత్తారు. దేవాదుల ఇన్‌టెక్ వెల్, దేవన్నపేట పంప్‌హౌస్‌ల్లో ఏం జరుగుతున్నదో బీఆర్ఎస్ అప్రమత్తం చేసేదాకా రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడలేదని ఎద్దేవా చేశారు. దేవాదులలో 10 పంపులకు ఆరే నడుస్తున్నాయని, దేవన్నపేటలో మూడు పంప్‌లకు మూడు పనిచేయడం లేదని తాము చెప్పేదాకా రేవంత్‌కు తెలియకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ దెబ్బకు మరుసటి రోజే సీఎం హడావిడిగా గోదావరి బాటపట్టి అన్ని మోటర్లు నడుపాలని ఆదేశించారని పేర్కొన్నారు.
రోజుకో డెడ్‌లైనా?
దేవాదుల విషయంలో డెడ్లైన్లు మారుతున్నాయే తప్ప ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో దేవాదుల ప్రాజెక్టుకు రూ.7,300 కోట్లు ఖర్చుచేసి 90% పనులు పూర్తి చేసి 3.20లక్షల ఎకరాలకు నీరందించామని గుర్తుచేశారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, నీటి పారుదల శాఖ ఉత్తమ్ 2027 మార్చి అని, సీఎం రేవంత్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని కొత్త డెడ్‌లైన్ పెట్టారని, రోజుకో డేట్ మార్చుతున్నారని మండిపడ్డారు..