పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి.. హ‌రీశ్ రావు

మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హరీశ్ రావు కాగజ్ మద్దూర్ గ్రామంలో దయనీయమైన దృశ్యాన్ని చూసి చలించిపోయారు. స్థానిక నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డితో కలిసి వెళ్తుండగా మార్గం మధ్యలో కరెంటు లేక ఎండిపోతున్న వరి పొలాలను చూసి పొలంలోకి వెళ్లి అక్కడున్న మహిళా రైతు నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు.చిట్టోళ్ల నాగమణి అనే ఆ మహిళా రైతు హరీశ్ రావు ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. బోర్లలో నీళ్లున్నా.. ప్రభుత్వ చేతకానితనం వల్ల కరెంటు రాక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని వాపోయింది. సుమారు 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టి 3 ఎకరాల్లో వరి నాట్లు వేస్తే.. అందులో సగం పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. పంట పొట్టకొచ్చే దశలో నీళ్లు అత్యంత అవసరమని, సరిగ్గా ఈ సమయంలోనే కరెంటు లేక రైతుల బతుకులు ఆగం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి..

గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పగటిపూట నిరంతరాయంగా కరెంటు వచ్చేదని, ఎలాంటి రంది లేకుండా పంటలు పండించుకున్నామని నాగమ్మ గుర్తుచేసుకుంది. కానీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని వాపోయింది. ఉదయం 5 గంటలకు రావాల్సిన కరెంటు 8 గంటలకు వస్తోందని, ఆ వచ్చిన కరెంటు కూడా నిలకడగా ఉండకుండా మధ్యాహ్నం మళ్లీ కోతలకు గురవుతోందని వివరించింది.