కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అటకెక్కించింది..రమావత్ రవీంద్ర కుమార్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అటకెక్కించింది…

-రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..

దేవరకొండ……….
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అటకెక్కించిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో డిండి మండలం నగరదుబ్బ తండాకు చెందిన 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుంచి దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ…..విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, నేడు అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు, ట్రిప్పులు, తక్కువ వోల్టేజ్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు మోటార్లను పంచుకుని నీళ్లు పారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకాన్ని కొనసాగించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు విషయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. రైతు బీమా విషయంలోనూ రైతులకు భరోసా తగ్గిందని అన్నారు.కేసీఆర్ హయాంలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేవని, నేడు యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. డీఏపీ ధరల విషయంలోనూ రైతులపై భారం పెరిగిందని అన్నారు.కరెంట్ రాకపోయినా, నీళ్లు అందకపోయినా ఎల్‌నినో వంటి కారణాలను చూపుతూ ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. కృష్ణా నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని మోటార్లను పూర్తిస్థాయిలో నడపడం లేదని ఆరోపించారు. ఏఎంఆర్, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు నీరు అందుతున్న సమయంలో తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌తో పాటు ఇతర విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయకపోవడంతో వారి చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కంటి వెలుగు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు అమలు చేశామని, ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణలో నేడు పంటలు పండుతున్నాయంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన చెరువులు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి మౌలిక వసతులే కారణమని రవీంద్ర కుమార్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టాలని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు, పెన్షన్, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాల కంటే మెరుగైన పథకాలను అమలు చేసి చూపించాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి పాత రోజులు తెస్తామని చెప్పారని, ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడే పరిస్థితి, విద్యుత్ కోసం ఎదురుచూసే పరిస్థితి తిరిగి వచ్చిందని విమర్శించారు.ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీల సాధన కోసం అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగోటి రవీందర్ రావు,తదితరులు పాల్గొన్నారు.