హార్ముజ్ జలసంధిని సమర్థవంతంగా మూసివేయడంలో కీలక పాత్ర పోషించిన కమాండర్ తంగ్సిరి హతం.!

ఇరాన్ – హార్ముజ్ జలసంధికి సంబంధించి తాజాగా ఒక ప్రధాన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఆర్‌జిసి నావికాదళ కమాండర్ అలీరెజా తంగ్సిరి హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి. హార్ముజ్ జలసంధిని సమర్థవంతంగా మూసివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ నావికాదళాధిపతి, రియర్ అడ్మిరల్ అలీరెజా తంగ్సిరి వైమానిక దాడిలో మరణించినట్లు తేలింది..ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేతలో కీలక పాత్ర పోషించిన ఆయనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు ఈ దాడి చేసినట్లు సమాచారం.

యుద్ధం నాలుగో వారానికి చేరుకున్న సమయంలో ఇరాన్ మిలిటరీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నావికాదళాధిపతి అలీరెజా తంగ్సిరి, దక్షిణ ఇరాన్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో జరిగిన వైమానిక దాడిలో మరణించారు. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించి, అంతర్జాతీయ చమురు రవాణాను అడ్డుకోవడంలో తంగ్సిరి ప్రధాన వ్యూహకర్తగా ఉండేవారు. ఆయన మరణాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ధృవీకరిస్తూ, సముద్ర మార్గాలను అడ్డుకునే వారెవరైనా సరే, వారిని వేటాడి మరీ అంతం చేస్తాం అని హెచ్చరించారు.

హార్మూజ్ జలసంధి ప్రాముఖ్యత దృష్ట్యా ఈ దాడి అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా వర్తకం అయ్యే ముడిచమురులో సుమారు 20 శాతం ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ ఈ మార్గాన్ని ఇరాన్ దళాలు వేసి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ చోక్ పాయింట్ ను తిరిగి తెరిపించేందుకు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే, దానికి బాధ్యుడైన తంగ్సిరిని అంతం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరికొందరు ఉన్నత స్థాయి నావికాదళ అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అలీరెజా తంగ్సిరి మరణం ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. 2018 నుండి నావికాదళాధిపతిగా ఉన్న ఆయన, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకలను సవాలు చేస్తూ దూకుడుగా వ్యవహరించేవారు. గత వారమే ఆయన అమెరికా చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వంటి అగ్రనేతలు దాడుల్లో మరణించిన సమయంలో, ఇప్పుడు నావికాదళాధిపతి కూడా తప్పుకోవడం ఇరాన్ నాయకత్వంలో పెద్ద శూన్యాన్ని సృష్టించింది.