ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్… ఒక పైలట్, ఐదుగురు ప్రయాణికులు మృతి..!

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్ బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ వెళ్తుండగా జోషిమఠ్ వద్ద కుప్పకూలిన ట్రాన్స్ భారత్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్ హెలికాప్టర్‌లో ఒక పైలట్, ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుండి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తున్నహెలికాప్టర్ శుక్రవారం మధ్యాహ్నం చమోలి జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఆరుగురు మరణించారు. ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ శుక్రవారం మధ్యాహ్నం 1.14 గంటలకు బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధార హెలిపోర్ట్‌కు బయలుదేరింది. అయితే ఈ హెలికాప్టర్ మార్గమధ్యలో జోషిమఠ్ ప్రాంతంలోని చాయ్ గ్రామం సమీపంలో ఒక కొండను ఢీకొన్నట్లు సమాచారం. జోషిమఠ్ లోయను దాటుతున్నప్పుడు హెలికాప్టర్‌‌తో గ్రౌండ్ స్టాప్‌కు సంబంధాలు తెగిపోయాయి.

అయితే జోషిమఠ్‌ వద్ద హతి పర్వతం సమీపంలో హెలికాప్టర్ అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు. హెలికాప్టర్ ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలో దిగాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డిఆర్‌ఎఫ్), సైన్యం, పోలీసులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపి) సిబ్బందితో కూడిన బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాదు. అయితే హెలికాప్టర్‌లోని ఆరుగురు మరణించినట్లు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు… ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) సీఈఓ ప్రతీక్ జైన్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ… ‘‘ఈరోజు మధ్యాహ్నం 1.14 గంటలకు హెలికాప్టర్ బద్రీనాథ్ నుంచి సహస్రధార హెలిపోర్ట్‌కు బయలుదేరింది. అది జోషిమఠ్ లోయను దాటుతుండగా ట్రాకింగ్ సిస్టమ్‌లో దాని ఆచూకీ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి మాకు కొంత స్థానిక సమాచారం కూడా అందింది. అయితే ఇప్పటివరకు ఏదీ ధృవీకరించబడలేదు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… హెలికాప్టర్‌లో పైలట్, ఐదుగురు ప్రయాణీకులతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. హెలికాప్టర్ ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే చమోలీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం’’ అని ఆయన అన్నారు…ఆర్మీకి చెందిన ఒక యూనిట్‌తో పాటు ఎస్డీఆర్ఎఫ్ దళాలను కూడా రంగంలోకి దించాము. వాతావరణం చక్కబడగానే, గల్లంతైన హెలికాప్టర్‌ను గుర్తించేందుకు ఇక్కడి నుంచి మరో సహాయక హెలికాప్టర్‌ను పంపుతాము’’ అని ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి అందిన సమాచారంతో అధికారులు గాలింపు చర్యలను ప్రారంభించారు.

జోషిమఠ్ పోలీస్ పోస్ట్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ మనోహర్ కన్యాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ… ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మధ్యాహ్నం 2:21 గంటలకు జోషిమఠ్ సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM) నుంచి అందిందని తెలిపారు.