విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి..మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్…

*10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్ వెల్*

*సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి… భావోద్వేగంగా వీడ్కోలు*

10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ వెనుక గల చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఫేర్‌వెల్ కార్యక్రమానికి హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలలో నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలు జీవితంలో వారికి మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను విశ్వసించి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం చైతన్య పాఠశాల కరెస్పాండెంట్ మేరెడ్డి యల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను నమ్ముకుని కష్టపడి ముందుకు సాగితే భవిష్యత్తులో గొప్ప స్థానాలను అందుకుంటారన్నారు. ప్రధానోపాధ్యాయులు సారెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో గడిపిన రోజులు విద్యార్థుల జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా నిలుస్తాయని విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయులకు, పాఠశాలకి కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ విద్యార్థులు పాటలు, నృత్యాలు, వినోదాత్మక కార్యక్రమాలతో సీనియర్ విద్యార్థులను అలరించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా ఫేర్‌వెల్ పలికారు. ఉపాధ్యాయులు, జూనియర్ విద్యార్థులు పాల్గొని సీనియర్ విద్యార్థులకు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులు తమ సహచరులు, ఉపాధ్యాయులతో కలిసి ఫోటోలు దిగుతూ పాఠశాల జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. భావోద్వేగ వాతావరణంలో ఫేర్‌వెల్ సభ ముగిసింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ సులవ నాగలక్ష్మి చంద్రశేఖర్, 4వ కౌన్సిలర్ దొంతిరెడ్డి పద్మా రాంరెడ్డి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.