ఇంగ్లండ్ పై భారత్ 100 పరుగుల తేడాతో విజయం… సెమీస్ లో. భారత్ బెర్త్ కరారు అయినట్లే..!!

వన్డే ప్రపంచకప్ 2023 (ICC ODI World Cup 2023)లో టీమిండియా (Team India) జైత్రయాత్ర కొనసాగుతుంది. మరోసారి చెమట పట్టకుండా విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు) రాణించారు. వీరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3 వికెట్లతో మెరిశాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు సాధించారు.

లక్నో వేదికగా ఇంగ్లండ్ (England)తో జరిగిన పోరులో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక డిఫెండింగ్ చాంపియన్ చతికిల పడింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ మరోసారి ఉగ్రరూపం ప్రదర్శించాడు. 4 వికెట్లతో చెలరేగిపోయాడు. మరో పక్క జస్ ప్రీత్ బుమ్రా కూడా 3 వికెట్లతో హడలెత్తించాడు. కుల్దీప్ యాదవ్ కూడా 2 కీలక వికెట్లు సాధించాడు. దాంతో భారత్ విజయం ఖాయమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (46 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ దారులు మూసుకుపోయాయి. 12 పాయింట్లతో భారత్ సెమీస్ కు దాదాపుగా అర్హత సాధించింది. అధికారికంగా ప్రకటించాలి అంటే భారత్ మరో మ్యాచ్ లో నెగ్గాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చివరి మూడు మ్యాచ్ ల్లో భారత్ ఓడినా సెమీస్ చేరడం పక్కా.
లక్ష్య ఛేదనలో ఆరంభంలో ఇంగ్లండ్ బాగానే ఆడింది. డేవిడ్ మలాన్ (16) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో శుభారంభం చేశాడు. తొలి వికెట్ కు బెయిర్ స్టో (14)తో కలిసి 30 పరుగులు జోడించాడు. అయితే ఇక్కడి నుంచే మ్యాచ్ టర్న్ అయ్యింది. బౌలింగ్ కు వచ్చిన బుమ్రా వరుస బంతుల్లో మలాన్, జో రూట్ (0)లను అవుట్ చేసి భారత్ కు డబుల్ బ్రేక్ అందించాడు. ఆ తర్వాత షమీ బెన్ స్టోక్స్ (0), బెయిర్ స్టో (0)లను అవుట్ చేసి ఇంగ్లండ్ ను దెబ్బ తీశాడు. దాంతో ఇంగ్లండ్ 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ బట్లర్ (10), మొయిన్ అలీ (15) కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. అయితే బౌలింగ్ కు వచ్చిన కుల్దీప్ యాదవ్ బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం మరోసారి బౌలింగ్ కు వచ్చిన షమీ మొయిన్ అలీ పని పట్టాడు. దాంతో ఇంగ్లండ్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. క్రిస్ వోక్స్ (10) భారీ షాట్ కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. కాసేపటికే లివింగ్ స్టోన్ కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్ కథ ముగిసింది.