మొదటి టెస్టు లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 243/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించి ఆతిథ్య న్యూజిలాండ్ 121 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది..ఓవర్‌నైట్ బ్యాటర్లు హెన్రీచ్ నికోల్స్(335 బంతుల్లో 21 ఫోర్లతో 175 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. గ్లేన్ ఫిలిప్స్(216 బంతుల్లో 14 ఫోర్లతో 118) సెంచరీతో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(4/92) నాలుగు వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్(3/53) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్షూల్ కాంబోజ్(2/69) రెండు వికెట్లు దక్కగా.. ప్రసిధ్ కృష్ణ(1/100) ఒక వికెట్ దక్కింది…
రెండో రోజు ఆట ఆరంభంలోనే ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో గ్లేన్ ఫిలిప్స్ 3 పరుగులు తీసి 193 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొత్త బంతితో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఫిలిప్స్, నికోల్స్ ఆచితూచి ఆడారు…నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసిన ఆకాష్ దీప్ ఈ జోడీని ఇబ్బంది పెట్టాడు. చివరకు గ్లేన్ ఫిలిప్స్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఫిలిప్స్ డిఫెన్స్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. దాంతో ఆరో వికెట్‌కు నమోదైన 216 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది..
న్యూజిలాండ్ 317/6 స్కోర్‌తో లంచ్‌బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే నాథన్ స్మిత్(14)ను ప్రసిధ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే కైల్ జెమీసన్(11)ను ఆకాష్ దీప్ అద్భుతమైన బౌన్సర్‌తో క్యాచ్ ఔట్ చేశాడు…మ్యాట్ హెన్రీ(1)ని బుమ్రా వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. జాకోబ్ డఫీ(4)ని అన్షూల్ కాంబోజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. మరో ఎండ్‌లో సహకారం కొరవడటంతో హెన్రీ నికోల్స్(175 నాటౌట్)కు డబుల్ సెంచరీ చేసుకునే అవకాశం చేజారింది…