భారత్-ఎ జట్టు అద్భుత విజయం..

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత యువ జట్టు 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది…ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగానే అవుట్ కావడంతో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో (101) జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీతో చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 150 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ స్కోరును అందించారు.

అనంతరం 278 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక-ఎ జట్టు చివరి వరకు గట్టిగా పోరాడి 269 పరుగులకు ఆలౌట్ అయింది. లంక జట్టులో కెప్టెన్ సహన్ (72), ఓపెనర్లు నిరోషన్ (47), ఫెర్నాండో (45), సదీరా (46) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు
(IND-A Won)చేర్చలేకపోయారు. భారత బౌలర్లలో అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, విప్రాజ్ నిగమ్, అర్షద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసి ఒత్తిడిలో భారత్‌కు విజయాన్ని అందించారు. సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది..

క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్..

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు వింత ర‌నౌట్ల‌ను చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ ర‌నౌట్ ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఏ, భార‌త్‌-ఏ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు….ముక్కోణ‌పు సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం దంబుల్లా వేదిక‌గా భార‌త్‌-ఏ, శ్రీలంక‌-ఏ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లు వైభ‌వ్ సూర్య‌వంశీ (14), ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్ (2) లు త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. 16 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు ఔట్ కావ‌డంతో ఇన్నింగ్స్‌ను న‌డిపించే బాధ్య‌త‌ను రుతురాజ్ గైక్వాడ్‌, ప్రియాన్ష్ ఆర్య‌లు భుజాన వేసుకున్నారు..ఈ స‌మ‌యంలో గంద‌ర‌గోళానికి లోనైన బ్యాట‌ర్లు ఇద్ద‌రూ పిచ్ పై ఒకే ఎండ్ వైపు(స్ట్రైకింగ్‌)కు ప‌రిగెత్తారు. కాగా.. ప్రియాన్ష్ కంటే ముందుగానే రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి వ‌చ్చేశాడు. మ‌రోవైపు ప్రియాన్ష్ ఆర్య క్రీజును చేరుకునే క్ర‌మంలో బ్యాట్‌ను నేల‌ను ఆనిపించి ముందుకు వెలుతుండ‌గా.. లంక వికెట్ కీప‌ర్ నిరోష‌న్ డిక్వెల్లా కాలు కింద అత‌డి బ్యాట్ ఇరుక్కుపోయింది.

దీంతో అత‌డు స‌మ‌యానికి క్రీజులోకి రాలేక‌పోయాడు. ఫీల్డ‌ర్ నుంచి బంతిని అందుకున్న కీప‌ర్ మ‌రో ఎండ్‌లో వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అయితే..థర్డ్ అంపైర్ ఈ విషయాన్ని (కీప‌ర్ కాలు కింద బ్యాట్ ఇరుక్కుపోవ‌డం) గమనించకుండానే ఔట్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కీపర్ కాలు అడ్డుపడకపోయి ఉంటే.. రుతురాజ్ కంటే ముందే ప్రియాంశ్ క్రీజులోకి చేరి ఉండేవాడని, అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..