నిశ్శబ్దంగా ఆసియాలో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న భారతదేశం..!

భారతదేశం, ఉత్తర కొరియాతో సంబంధాలు ..

ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అందరి దృష్టి మధ్యప్రాచ్యం, ఐరోపాలోని సంఘర్షణలపై కేంద్రీకృతమై ఉంది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి..కొన్ని మిత్రదేశాలు యుద్ధంలో నిమగ్నమైన దేశాలకు సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలో భారతదేశం నిశ్శబ్దంగా ఆసియాలో తన సంబంధాలను బలోపేతం చేస్తోంది. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా, ఇండియా మూడున్నరేళ్ల తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది.

ఉ.కొరియాలో రాయబార కార్యాలయం
ఉత్తర కొరియా ప్రభుత్వం రహస్య స్వభావం కారణంగా ఆ దేశంతో భారతదేశం సంబంధాలు ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాయి. 2021 జులైలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశం ప్యాంగ్యాంగ్‌లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విదేశాంగ శాఖ అధికారికంగా దీని గురించి ప్రకటించకపోయినా, రాయబారి అతుల్ మల్హరీ గోట్సర్వే సహా సిబ్బంది అంతా మాస్కో మీదుగా న్యూఢిల్లీకి తిరిగి వచ్చేశారు. గోట్సర్వేను 2022లో మంగోలియాకు కేటాయించారు.

ఇప్పుడు ప్యాంగ్యాంగ్‌లోని రాయబార కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది. ‘ది ట్రిబ్యూన్’ తెలిపిన వివరాల ప్రకారం, కార్యాలయం ప్రారంభించేందుకు టెక్నికల్‌ స్టాఫ్‌, దౌత్యవేత్తల బృందాన్ని భారత్ ఉత్తర కొరియాకు పంపింది. ఉత్తర కొరియా విస్తృతమైన నిఘా, గూఢచార కార్యకలాపాల కారణంగా ముఖ్యమైన ముందుజాగ్రత్తగా రాయబార కార్యాలయ భవనాన్ని చెక్‌ చేయడం, సెక్యూర్‌గా మార్చడం వారి మొదటి పని. అయితే ఉత్తర కొరియా అధికార ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరిగుతాయి. అందుకే కొత్త రాయబారి, మరింత మంది సిబ్బంది బృందంలో చేరడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు.

భారత్‌కు ఉ.కొరియా ఎందుకు కీలకం?..

ప్రపంచ వేదికపై ఉత్తర కొరియా ప్రాముఖ్యత ఇటీవలి సంవత్సరాల్లో పెరిగింది. అణ్వాయుధాలు, హైపర్‌సోనిక్ మిసైల్స్‌, ఇతర వ్యూహాత్మక వ్యవస్థలతో దేశం తన సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంది. అటువంటి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ పాకిస్థాన్‌ లేదా భారతదేశానికి శత్రుత్వం ఉన్న ఇతర దేశాలకు, సమూహాలకు అందకుండా భారత్‌ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఉత్తర కొరియాలో భారత రాయబార కార్యాలయం ఉండాలి.

అదనంగా ఉత్తర కొరియా రష్యా, చైనా, ఇరాన్‌తో బంధాలు బలపరుచుకుంటోంది. ఈ దేశాలు యూఎస్‌, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన క్వాడ్‌కు కౌంటర్ బ్యాలెన్స్‌గా పనిచేసే కూటమిని ఏర్పరుస్తున్నట్లు భావిస్తున్నారు. రష్యాతో ఇప్పటికే బలమైన సంబంధాలు, ఇరాన్‌తో యాక్టివ్‌ రిలేషన్‌ కలిగి ఉన్న భారతదేశం, ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం గుర్తించింది. అందుకే రాయబార కార్యాలయం కీలక అడుగు వేసింది. ఈ చర్యలతో ఆసియా అంతటా సమతుల్యత, సహకారాన్ని పొందాలనే భారతదేశం విస్తృత వ్యూహం బలపడుతుంది. చైనాతో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం కోసం పని చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది..