ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) రికార్డుల మోత మోగిస్తున్నాడు. మొన్న16 బంతుల్లో అర్ధ శతకంతో మెరిసిన వైభవ్ ఈసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. గువాహటిలో ఆర్సీబీ పేసర్లను అనామకుల మాదిరిగా ఉతికేసిన ఈ చిచ్చరపిడుగు సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి వేగవంతమైన యాభైతో తన మార్క్ విధ్వంసంతో అభిమానులను అలరించాడు. బాదుడే పరమావధిగా ఆడుతున్న ఈ కుర్ర బ్యాటర్ ఐపీఎల్లో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు…జూనియర్ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్లో వరసపెట్టి ప్రపంచస్థాయి బౌలర్లను ఉతికేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓవర్లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. ఈ దఫా ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్‌కు చుక్కలు చూపించాడు. తొలిసారి హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొన్న ఈ బుడ్డోడు వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు చేశాడు..
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్న ఈ భారతీయ యువ జోడీ, తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు పుస్తకాలను తిరగరాసింది. వీరిద్దరి ధాటికి దిగ్గజ ఓపెనర్ల రికార్డులు సైతం కనుమరుగయ్యాయి.
Rajasthan Royals Opening Partnership: గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక పోరుకు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన గణాంకాలతో వార్తల్లో నిలిచారు. కేవలం 248 బంతుల్లోనే 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వీరు ఆడిన ఇన్నింగ్స్ బౌలర్లకు పీడకలగా మారింది. కేవలం 11 ఓవర్ల మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ 14 బంతుల్లో 39 పరుగులు చేయగా, యశస్వి 32 బంతుల్లో 77 పరుగులతో విరుచుకుపడ్డారు.
సెహ్వాగ్ – గంభీర్ రికార్డులు బద్ధలు..
గతంలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 309 బంతుల్లో 500 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును వైభవ్ – యశస్వి జోడీ కేవలం 248 బంతుల్లోనే అధిగమించడం విశేషం. అయితే ఓవరాల్‌గా చూస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ అత్యంత వేగవంతమైన 500 పరుగుల రికార్డులో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది.