చర్చలు సఫలమయ్యే దశలో…యుద్ధానికి సన్నద్ధం.|

అమెరికా-ఇజ్రాయెల్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కి ప్రతిస్పందనగా ఇరానియన్ల ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌-4’ మొద లైంది. గత జూన్‌ నాటి ‘ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హ్యామర్‌’కు ఇరాన్‌ నిర్ఘాంత పోయింది. కానీ, ఈసారి అది ఎదురు దెబ్బ తీసేందుకు పూర్తి సన్నద్ధమై ఉండటం అమెరికా-ఇజ్రాయెల్‌లను ఆశ్చర్యపరచింది.

గగనతలం నుంచి వచ్చి పడుతున్న బాంబులను ఇరాన్‌ గట్టి గానే తట్టుకుని నిలబడింది. గల్ఫ్‌ దేశాలపైన, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు మొదలెట్టింది. బహ్రెయిన్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా నౌకాదళ 5వ యుద్ధ నావల సమూహాన్ని విస్తృతంగా నష్టపరచింది. కువైట్‌ గగనతలంలో నాలుగు అమెరికా యుద్ధ విమానాలను కూల్చి వేసింది.

ఇరాన్‌… వెనెజులా కాదు!
ప్రస్తుతానికి యుద్ధం సద్దుమణగే అవకాశం లేకపోగా ప్రాంతీయ యుద్ధంగా పరిణమించగల పెను ప్రమాదంలో ఉంది. గల్ఫ్‌ దేశాలు ఎప్పుడు ఎక్కడ రణరంగంలోకి దిగుతాయన్నదే ప్రశ్న. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్‌ దాడితో గల్ఫ్‌ దేశాలు ఉలిక్కి పడ్డాయి. ”అమెరికా సైనిక స్థావరాలకు చోటు కల్పించిన గల్ఫ్‌ దేశా లను (అమెరికా) గాలికొదిలేసింది. అవి ఇరాన్‌ దాడులకు సులభమైన లక్ష్యంగా మారాయి” అని సౌదీ అధికారి ఒకరు వాపోయారు. అమెరికా స్థావరాలకు తమ భూభాగాల్లో చోటిచ్చామనీ, కానీ దాని చర్యలకు తమకు సంబంధం లేదనీ నటించడం మానుకోవాలనీ గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ సభ్య దేశాలను ఇరాన్‌ గట్టిగానే హెచ్చరించినట్లయింది.

వెనిజులాకూ, ఇరాన్‌లో పరిస్థితికీ పోలిక లేదు. ఇరాన్‌లో పాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా వేసుకున్న అంచనాలు ఘోరంగా తప్పినట్లు కనిపిస్తోంది. అసలు యుద్ధ ఆశయాల పైన, ఆశిస్తున్న అంతిమ ఫలితంపైన అమెరికా-ఇజ్రాయెల్‌ల మధ్య తేడాలున్నాయి. వాటి మధ్య స్పష్టత కొరవడటం మరింత గందర గోళానికి కారణమవుతోంది.

ఇరాన్‌ ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితిలో పడిపోతుందని చాలా మంది అంచనా వేశారు. గత ఏడాది జూన్‌లో అమెరికా వైమానిక దాడులతో ఇరాన్‌ అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమం దెబ్బతిన్న మాట వాస్తవమే. అలాగే, ఇరాన్‌ ప్రాంతీయ మిత్రపక్షాలను ఇజ్రాయెల్‌ చావుదెబ్బ తీయడంతో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ఆశించిన వ్యూహ పరిమితులు బహిర్గతమయ్యాయి. ఆ దేశాలు మొదటి రక్షణ కవచంగా ఉపయోగపడతాయనీ, ప్రతిఘటన ఇరుసు ఫలితమిస్తుందనీ కోర్‌ ఆశలు పెట్టుకుంది. తీరా అంచనాలు తలకిందులయ్యాయి. దేశవ్యాప్తంగా సామాజికంగా హాహాకారాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. అవి పాలక మత వ్యవస్థను కుదిపేశాయి.

చర్చలు సఫలమయ్యే దశలో…
ఇరాన్‌-అమెరికాల మధ్య ఓ పక్క చర్చలు కొనసాగుతూండ గానే అమెరికా-ఇజ్రాయెల్‌లు దాడులను తీవ్రతరం చేశాయి. గత ఏడాది ఇరాన్‌పై సాగించిన 12 రోజుల యుద్ధంలో అనుసరించిన కుటిల నీతినే అమెరికా ఈసారి కూడా ప్రదర్శించింది. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమంపై రెండు దేశాలూ సవివరంగానే చర్చించుకున్నాయి. తాజా చర్చలకు ఒమన్‌ విదేశాంగ మంత్రి బదర్‌ అల్‌ బుసైదీ మధ్యవర్తిత్వం వహించారు. ఇరాన్‌ తమ అణు కార్యక్రమంపై ఎంతో దిగివచ్చిందని ఇటీవలి జెనీవా సమావేశం తర్వాత ఆయన వెల్లడించారు. ”ఇరాన్‌ ఎన్నటికీ అణుబాంబు తయారు చేయకపోవడమే అంతిమ లక్ష్యం అనుకుంటే, ఆ సమస్యను మేం పరిష్కరించగలిగామనే భావిస్తున్నా” అని ఆయన అన్నారు. తీరా, అమెరికా సైనిక దాడులకు దిగడం చూసి ఆయన ”విస్మయం” వ్యక్తం చేశారు.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (86) మృతికి దారితీసే విధంగా అమెరికా-ఇజ్రాయెల్‌ల వైమానిక దాడులకు దిగ కుండా ఉంటే, పరిస్థితులు ఇంత వేగంగా క్షీణించి ఉండేవి కావని పిస్తోంది. షియా వర్గీయులకు ప్రాణత్యాగం (షహదత్‌) కన్నా మించింది లేదు. మతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మృత్యువు కౌగిట జేరడాన్ని వారు గర్వకారణంగా భావిస్తారు.

లెబనాన్, ఇరాక్‌ నుంచి పాకిస్తాన్‌ వరకు పలు దేశాల్లోని షియా వర్గీయులు ఆవేశంతో ఊగిపోతున్నారు. లెబనాన్‌ నుంచి ఇజ్రా యెల్‌పై దాడికి హెజ్బొల్లా కొత్త ద్వారాలు తెరచింది. ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హ్యామర్‌ సమయంలో కూడా మౌనంగా ఉన్న లెబనీస్‌ హెజ్బొల్లా ఈసారి కత్తులు నూరుతోంది. ఇరాన్‌ అనుకూల మిలీ షియా గ్రూప్‌ ఖతైబ్‌ హెజ్బొల్లా ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి దిగింది.

వినాశకర పర్యవసానాలు
ఈ పరిణామాలన్నీ భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరుస్తు న్నాయి. ఎందుకంటే, చమురు దిగుమతులకు మనం గల్ఫ్‌ పైనే ఆధారపడుతున్నాం. తొంభై లక్షలకు పైగా భారతీయులు గల్ఫ్‌లో వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు. ఇరాన్‌ వెలుపల అత్యధిక షియా జనాభా భారతదేశంలోనే ఉన్నారు. లక్నో, హైదరాబాద్, కార్గిల్‌ లాంటిచోట్ల షియా అనుయాయులు ఎక్కువ. ఖమేనీ హత్య వారిలో ఆవేశకావేషాలను పెంచింది.

ఇరాన్‌ కూడా సభ్యురాలుగా ఉన్న ‘బ్రిక్స్‌’కు భారత్‌ అధ్యక్షురాలిగా ఉంది. మన విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తన ఇరాన్‌ సహచరునితో మాట్లాడారు. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్‌ క్షిపణి దాడి తర్వాత, క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ప్రాంతీయ శాంతి-సుస్థిరతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు. దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు.

అమెరికా-ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్యల వినాశకర పర్యవ సానాలు బహు విధాలుగా, బహుముఖంగా అనుభవానికి వస్తు న్నాయి. అంతర్జాతీయ నౌకల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీలలో సౌదీ ఆర్మకోకు చెందిన రాస్‌ తనూరా చమురు శుద్ధి కర్మాగారం ఒకటి. పెద్ద ఎగుమతి టెర్మినళ్లలో కూడా ఒకటిగా అది లెక్కకు వస్తుంది. దాని మూసి వేతతో అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం ఆకాశానికంటే అవకాశం ఉంది. ఈ యుద్ధం మరికొన్ని వారాలపాటు సాగుతుందని ట్రంప్‌ య«థాలాపంగా చెబుతున్నారు. అది ఇరాన్‌కున్న స్థితిస్థాపక శక్తిని, పునర్‌ దాడి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడమే అవుతుంది. బహుశా, ఇంతగా పర్యవసానాలున్న ఘర్షణల్లోకి కొన్ని దశాబ్దాలుగా అమెరికా తలదూర్చింది లేదు.

ఇతర దేశాల్లో మాదిరిగా చాలా తేలిగ్గా పాలక అధినేతను మార్చి వేయగలమని అమెరికా పెట్టుకున్న ఆశలు ఈ క్రమంలో అడియాసలే అవుతాయి. ఇరాన్‌లో మత పాలనా వ్యవస్థ ఒక్క సారిగా కుప్పకూలిపోతుందని అమెరికా పెట్టుకున్న అంచనాలు… బాంబులు, క్షిపణులు సృష్టిస్తున్న ఉష్ణోగ్రతలకు ఈపాటికే ఆవిరై పోయాయి…!