రవితేజ ‘ఇరుముడి’ జోరు..

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండటంతో, తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలను, మరిన్ని థియేటర్లను జోడిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సినిమాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు.

ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొత్త థియేటర్లను జోడించడంతో పాటు, ఉన్న థియేటర్లలోనూ అదనపు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

‘రవన్న బాక్సాఫీస్ దండయాత్ర’ కొనసాగుతోందని చిత్రబృందం ప్రచార చిత్రాల ద్వారా పేర్కొంటోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. టీ-సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో విడుదలైన ‘ఇరుముడి’, రవితేజ అభిమానులను, మాస్ సినీ ప్రియులను అలరిస్తూ థియేటర్లలో విజయవంతంగా తన ప్రదర్శనను కొనసాగిస్తోంది.

కథ
సీలేరు ప్రాంతంలో త్రినాథ్(రవితేజ) ఆటో నడుపుతూ, అరటిపళ్ల వ్యాపారం చేస్తూ కూతురు మణెమ్మ(నక్షత్ర), భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. ఆ ప్రాంతంలో అందరి ఆడపిల్లలని తన కూతురులానే చూస్తుంటాడు. తనకు మద్యం అలవాటు ఉంటుంది. కాకపోతే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు మాత్రం మందు జోలికి వెళ్లడు. అదే ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని అనూహ్యంగా చనిపోతుంది. ఆ మరణం వెనుక ఉన్నది ఎవరు? ఈ చావు త్రినాథ్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది మిగతా కథ.

విశ్లేషణ
తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే కుటుంబ, అయ్యప్ప మాల నేపథ్యంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘ఇరుముడి’ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా కథ ప్రారంభం ఓ స్కూల్లో టీచర్ సస్పెండ్ అవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కుటుంబం, మణెమ్మతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎప్పుడైతే పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి అనూహ్యంగా చనిపోతుందో, అక్కడి నుంచి కథలో ఉత్కంఠ పెరుగుతుంది. అది విరామానికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఎమోషన్ కలిగిస్తుంది. ఈ కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో మంచి ట్విస్టులు రాసుకున్నారు. అలాగే ప్రీ-క్లైమాక్స్‌కు ముందు కాస్త సాగదీసినట్టుగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్‌ను మాత్రం బలంగా రాసుకున్నారు. అదే సమయంలో ఆ క్లైమాక్స్ మనసును కలచివేస్తుంది. ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కథను దర్శకుడు శివ నిర్వాణ నడిపించారు. అదే సమయంలో ఒక బలమైన సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశం కచ్చితంగా గుర్తుపెట్టుకుని పాటించదగ్గదిగా ఉంటుంది.

రవి తేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ భారీ అంచనాల మధ్య థియేటర్లలో ప్రదర్శన ప్రారంభించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నటుడి సాధారణ వాణిజ్య శైలికి భిన్నంగా, బలమైన సామాజిక సందేశంతో కూడిన భావోద్వేగ కథపై దృష్టి సారించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి ప్రేక్షకుల స్పందనలను బట్టి చూస్తే, ఈ చిత్రం రొటీన్ మాస్ మూమెంట్స్ కంటే భావోద్వేగాలు, నటన, ప్రధాన ఇతివృత్తంపైనే ఎక్కువగా ఆధారపడిందని తెలుస్తోంది.

రవి తేజ నటనను, భావోద్వేగభరితమైన కథను అభిమానులు ప్రశంసించారు. రవి తేజ నటన, సినిమాలోని భావోద్వేగ ప్రధానాంశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక ప్రేక్షకుడు దీనిని “రవి తేజ బలమైన పునరాగమనం”గా అభివర్ణిస్తూ, సినిమాలోని సామాజిక అంశాన్ని, అమ్మాయిలు ఎదుర్కొనే కష్టాలను అది హైలైట్ చేసిన తీరును ప్రశంసించారు. మరో అభిమాని ‘ఇరుముడి’ని “స్ఫూర్తిదాయకమైన మరియు ఆకట్టుకునే” చిత్రంగా అభివర్ణిస్తూ, తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని మెచ్చుకున్నారు. మొదటి భాగం నెమ్మదిగా సాగడంతో మిశ్రమ స్పందనలు వచ్చాయి, కానీ అందులోని ఉత్కంఠ, భావోద్వేగ బంధం కథను ముందుకు నడిపించాయని చాలా మంది ప్రేక్షకులు భావించారు. బాలనటుడు మరియు సాయి కుమార్ నటనకు కూడా ప్రశంసలు లభించాయి