ఇస్రో బాహుబలి ప్రయోగం సక్సెస్‌…శాటిలైట్ ప్రత్యేకతలు ఇవే..!!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో కలికితురాయి. వాణిజ్య ప్రయోగాల్లో కీలక ముందడుగు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి బుధవారం చేపట్టిన బాహుబలి రాకెట్‌ ‘లాంచ్‌ వెహికల్‌ మార్క్‌ (ఎల్‌వీఎం3)-ఎం6’ ప్రయోగం విజయవంతమైంది.

దీనిద్వారా అమెరికాకు చెందిన 6,499 కిలోల బరువైన అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్స్‌ ఉపగ్రహం ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’ను దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో చరిత్రలో ఇదే భారీ ఉపగ్రహం కావడం విశేషం. అమెరికా సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌ మొబైల్‌తో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగం చేపట్టింది.

ఆసాంతం సజావుగా ప్రక్రియ
మంగళవారం ఉదయం 8.59 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్‌… బుధవారం ఉదయం 8.59 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి 43.5 మీటర్ల పొడవైన ఇస్రో బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం6 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లడం ద్వారా పూర్తయింది. మూడు దశల్లో ప్రయోగం సాగింది. భూమి నుంచి బయల్దేరిన 16 నిమిషాల అనంతరం ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’ ఉపగ్రహం… వ్యోమ నౌక నుంచి విడివడింది. 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఈ విషయాన్ని ఏఎస్‌టీ సంస్థ కూడా ధ్రువీకరించింది.

మిన్నంటిన హర్షధ్వానాలు…
రాకెట్‌లో ఒక్కొక్క దశ అద్భుతంగా పనిచేస్తూ వెళ్లడం…బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన ఎల్‌వీఎం3 వరుసగా తొమ్మిదోసారి విజయవంతం కావడంతో కంట్రోల్‌ రూమ్‌లోని శాస్త్రవేత్తలు హర్షధ్వానాలు చేశారు. తాము ఊహించిన అద్భుతం సాధ్యమైందని, ఇస్రో చరిత్రలో ఇది చెరిగిపోని రికార్డు అని, తమలో సరికొత్త ఉత్సాహం నింపిందని పొంగిపోయారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు..

రంగంలోకి బాహుబలి ఇలా..
మిషన్‌లోని క్లిష్టతలను పూర్తిగా అర్థం చేసుకొన్న ఇస్రో టీమ్‌ ప్రయోగం చేయడానికి సమ్మతించింది. అయితే, 6,100 కిలోల బరువు ఉన్న ఇంత భారీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టాలంటే బాహుబలి రాకెట్‌ అవసరపడుతుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ గుర్తొచ్చింది. ఈ రకం వ్యోమనౌక ద్వారానే చంద్రయాన్‌-2, చంద్రయాన్‌-3తో పాటు 72 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి తీసుకెళ్లడం వంటి భారీ ప్రయోగాలను పూర్తి చేశారు. అంతే, అత్యంత తక్కువ సమయంలోనే 43.5 మీటర్ల పొడవైన ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఎక్కడినుంచైనా హలోహలో…
ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్‌ ఫోన్లకు కనెక్టివిటీ లక్ష్యంతో బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 మిషన్‌ను తలపెట్టారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ వేళలో అయినా, ఎవరికైనా 4జీ, 5 జీ వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్‌లు, ప్రసారాలు అందించాలన్నది ఏఎస్‌టీ సంస్థ లక్ష్యం. బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్‌లో అభివృద్ధి చేశారు. విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. దీనికి 64 చదరపు మీటర్ల వినూత్న యాంటెన్నా ఉంది. భూమికి తక్కువ దూరంలోని లియో ఆర్బిట్‌ నుంచి పనిచేస్తుంది.

వాణిజ్య ప్రయోగాల్లో మరోసారి సత్తా చాటారు
ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్‌ ప్రయోగం దిగ్విజయం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో మన దేశ సత్తాను మరోసారి చాటారని కొనియాడారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అత్యున్నత శిఖరాలకు చేరుతోందంటూ ట్వీట్‌ చేశారు. -ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959