బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆ పార్టీ కీలక ప్రకటన జారీ చేసింది. కేసీఆర్ కేవలం రెగ్యులర్ వైద్య పరీక్షల కోసమే హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది..ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు అవసరం లేదని, అన్ని పరీక్షలు సాధారణంగా జరిగాయని పార్టీ స్పష్టం చేసింది.
వైద్యుల బృందం కేసీఆర్ను పూర్తిగా పరీక్షించినట్లు బీఆర్ఎస్ తెలిపింది. పరీక్షల ఫలితాల ప్రకారం, కేసీఆర్ ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు పార్టీ పేర్కొంది. అయితే, రొటీన్ తనిఖీలలో భాగంగా మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో, కేసీఆర్ మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.
ఈ ప్రకటనతో కేసీఆర్ ఆరోగ్యంపై అనవసర ఊహాగానాలకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు..
కేసీఆర్ కు ఏమైంది?
కేసీఆర్ ఆరోగ్యంపై నిన్న యశోద ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వీక్ నెస్ కారణంగా నిన్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు బులిటెన్ లో పేర్కొంది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా.. అధిక స్థాయిలో షుగర్.. తక్కువ స్థాయిలో సోడియం ఉన్నట్లు తేలిందన్నారు. మిగతా అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నట్లు వచ్చాయన్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంతో పాటు సోడియం లెవెల్స్ ను పెంచేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.