నువ్వేం సీఎంవి? నీదేం భాష?..అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

నువ్వేం సీఎంవి? నీదేం భాష?

అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

కొడంగల్ లాగా మునుగోడుకు నిధులు ఇవ్వమంటే రేవంత్ పండబెట్టి తొక్కుతానంటున్నాడు

ఈయనేం ముఖ్యమంత్రి? ఆ భాష ఏంటి? ప్రాంతాల మధ్య సీఎం వివక్ష చూపించడమేంటి?

నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా నీకు? అదృష్టం బాగుండి సీఎం అయ్యావు

అధికారం ఉందని ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం మొదలవుతుంది

ఉన్న సిటీకే గతి లేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు? రూ. కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమేంటి?

రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పాం.. ఇప్పుడు ప్రజలకి ఏం జవాబు చెప్పాలి?

నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల మంజూరులో సీఎం, మంత్రులు పక్షపాతం చూపిస్తున్నారు

కొడంగల్‌కి రూ.10 వేల కోట్లు తీసుకెళ్తున్న రేవంత్ మునుగోడుకి రూ.500 కోట్లు కూడా ఇవ్వట్లేదు.

ప్రజలు సంతోషంగా లేరు.. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్‌ మాత్రమే కాదు.

మునుగోడుకి రావలసిన వాటా నిధులు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మరో కురుక్షేత్రం తప్పదు

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సమస్యలు అలాగే ఉన్నాయి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదీ ఏం భాష?. పండబెట్టి తొక్కుతా అనడం ఏంటి?” అని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు అడగొద్దా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. ఇంకా రెండేళ్లు సీఎం పదవి మంచిగా ఉండి… తెలంగాణ ప్రజల్ని మంచిగా చూసుకోవాలని కోరారు.

”నీకు అదృష్టం కలిసొచ్చింది, ముఖ్యమంత్రి అయినావు. ఇంకా రెండేళ్లు కూడా మంచిగా ఉండు. తెలంగాణ ప్రజల్ని మంచిగా చూసుకో. కొడంగల్‌తో పాటు వెనుకబడిన నియోజకవర్గాలైన మునుగోడుతో పాటు, ములుగు, ఆదిలాబాద్ వంటి వాటిని కూడా పట్టించుకో” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

”పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ నేను తిరగను. పదవుల కోసం నేను పాకులాడేవాడిని కాదు. నాకు మంత్రి పదవి లేకున్నా పర్లేదు… మీరే పదవుల్లో ఉండండి. నువ్వు (రేవంత్ రెడ్డి) ఏమన్నా అంటే కొడంగల్ అంటున్నావు, ఆయన (ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క) మధిర అంటుండు, ఉత్తమ్ కుమార్ ఏమో హుజూర్‌నగర్ అంటుండు, మరి మా పరిస్థితి ఏంది? నేను అడిగిన దాంట్లో తప్పేముంది? నిధులు అడగొద్దా?” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

”10 వేల కోట్ల రూపాయలు కొడంగల్‌కు తీసుకుపోతా అని ముఖ్యమంత్రి అంటున్నాడు… మరి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు శాసనసభ్యుడు కదా? ఇది అత్యధిక ఫ్లోరైడ్, కరువు ప్రాంతం. ఇక్కడి ప్రజలు విషం తాగుతున్నారు. చెరువులు, కుంటలకు కూడా ఒక 500 కోట్లు ఇయ్యకపోతివి. దిండి లిఫ్ట్ ఇరిగేషన్ మూడేళ్లుగా పని మొదలు కాకపాయే. మరి రోడ్లకు పైసలు ఇయ్యకపోతివి. ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు లేవు. చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ కూడా కాకపాయే. అలాంటప్పుడు మునుగోడుకు నేను నిధులు అడగకపోతే ఎట్లా?” అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఆపితే మరో కురుక్షేత్రం సృష్టిస్తానంటూ వ్యాఖ్యానించారు..