కొండా మురళికి సొంత జిల్లా ఎమ్మెల్యేల వార్నింగ్!.. బీసీ కార్డు అడ్డం పెట్టుకొని అడ్డగోలు మాటలు బంద్ చెయ్…!.

కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు..వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో వారంతా భేటీ అయ్యారు. సమావేశానికి జిల్లాకు చెందిన ఒక ఎంపీతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ ఎంపీ కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి సైతం ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సమావేశం అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్లు ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా హైకమాండ్ ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు..