పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టడం కాదు.. మీ కాంగ్రెస్ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. కేటీఆర్.
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..
పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టడం కాదు.. మీ కాంగ్రెస్ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. కేటీఆర్..
కాంగ్రెస్‌ది యూత్ డిక్లరేషన్ కాదు.. బూతు డిక్లరేషన్: కేటీఆర్
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి సభలో కేటీఆర్ మాట్లాడారు.
పోరాటాలకు పురిటిగడ్డ అయిన కరీంనగర్ నుంచే యువత మరో పోరాటానికి సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఇదే కరీంనగర్ నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. యువత, విద్యార్థులు ఉద్యమిస్తే పెద్దపెద్ద ప్రభుత్వాలే దిగివచ్చాయని అన్నారు.
జాబ్ క్యాలెండర్ ఎక్కడ.. స్కాం క్యాలెండర్ నడుస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాల విషయంలో స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘‘నోటిఫికేషన్ లేదు.. లూటిఫికేషన్ మాత్రం నడుస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదు.. రాష్ట్రంలో స్కాం క్యాలెండర్ నడుస్తోంది’’ అని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, యువతకు రూ.10 లక్షల రుణాలు, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్ వంటి హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీయూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
‘యూత్ డిక్లరేషన్’పై కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్‌ది యూత్ డిక్లరేషన్ కాదని.. ‘‘రేవంత్ బూతు డిక్లరేషన్’’ అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని యువత ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
‘‘యువతకు స్కిల్ లేదని ఎవరు చెప్పారు? మాకు స్కిల్ లేదని ఎవరు చెప్పారు? సీఎంకు స్కిల్ ఉందా అని విద్యార్థులు అడుగుతున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
అశోక్‌నగర్‌లో యువతను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు.
‘‘మీరు రాకపోతే మేమే ఢిల్లీకి వస్తాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పాలనలో సీఎం, మంత్రులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే వాటాల కోసం తన్నుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో విజన్ కనిపించడం లేదని.. విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేసి పోరాడారని కేటీఆర్ గుర్తుచేశారు. 2006లో కేసీఆర్ రాజీనామా చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేని రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ నుంచే యువత మరో ఉద్యమానికి సిద్ధం కావాలని, యువత పిడికిలి బిగిస్తే ప్రభుత్వాలు స్పందించక తప్పదని కేటీఆర్ అన్నారు.