కేటీఆర్ కీలక ప్రసంగం..ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. కేటీఆర్.

తాము ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తమ తొలి ప్రాధాన్యం తెలంగాణ అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం.. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ఎన్నారైలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘ఓట్లలో వెనుకబడ్డామేమో కానీ.. తెలంగాణను ప్రేమించడంలో ఎన్నడూ వెనకబడలేదు’ అని కేటీఆర్ తెలిపారు..14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో సాధించిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ రథసారథి కేసీఆర్ పాలనలో కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా ఎదిగింది’ అని కె తారకరామారావు తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ఇంత అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదని స్పష్టం చేశారు. తెలంగాణను అద్భుత అవకాశాల అక్షయపాత్రగా, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్‌గా తీర్చిదిద్దిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు..అమెరికాలోని డల్లాస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రసంగం చేసి తెలంగాణ గొప్పతనంతోపాటు ఉద్యమ చరిత్ర.. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించారు. అనంతరం మూడేళ్లలో ఏం చేయాలనేది ఎన్నారై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు అమెరికా గడ్డ నుంచి పిలుపునిచ్చారు.
సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ రాష్ట్రం దేశానికి చాటిచెప్పింది. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో, పదేళ్ల తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో.. అడుగడుగునా కేసీఆర్ చారిత్రక ముద్ర వేశారు. సమైక్యపాలకుల వివక్షతో దశాబ్దాలపాటు పడావుబడ్డ తెలంగాణ దీనస్థితిని, కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా ఎదిగింది’ అని కేటీఆర్‌ వివరించారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. అమెరికాలో లీగల్ సెల్ ఏర్పాటుచేసి తెలుగు విద్యార్థులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు..