జడ్జిపై దురుసుగా ప్రవర్తించిన న్యాయవాదులపై లాఠీ విరిగింది. కోర్టు హాలులోనే వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు నిరసనకు దిగారు..ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బార్ అసోషియేషన్ అధికారికి చెందిన ఓ కేసు విషయమై న్యాయవాదులు ఘజియాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో లోపల ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోర్టు హాలులోకి వచ్చిన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
గాయపడిన న్యాయవాదులు?
న్యాయవాదులను అదుపు చేసే క్రమంలో పోలీసులు కోర్టు గదిలోనే వారిపై లాఠీఛార్జి చేశారు. బలవంతగా వారిని బయటకు పంపేందుకు ప్రయత్నంచారు. ఈ పెనుగులాటలో కొందరు న్యాయవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కోర్టు హాలులో న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నట్లు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే, బార్ అసోసియేషన్ న్యాయవాదుల సమావేశం తర్వాత న్యాయవాదులు తదుపరి వ్యూహాన్ని వెల్లడిస్తారని సమాచారం.
కుర్చీలను పైకిలేపి మరీ..
తాజాగా కోర్టు హాల్లోనే లాయర్లను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 20 నుంచి 35 మంది పోలీసులు న్యాయవాదులను లాఠీలతో కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. కోర్టు హాలులో ఉన్న కుర్చీలను పైకిలేపి మరీ.. పోలీసులు న్యాయవాదులను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే..