ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.
ఢిల్లీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి…సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన తాజా గణాంకాలు ఈ భయానక వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. 2020 జనవరి నుంచి 2026 జూలై మధ్య కాలంలో ఢిల్లీలోని నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఏకంగా 6,581 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 913 మంది మృత్యువాత పడ్డారు. ఈ లెక్కన రాజధానిలో సగటున ప్రతి మూడు రోజులకు ఒకరు ఊపిరితిత్తుల క్యాన్సర్తో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆసుపత్రుల వారీగా క్యాన్సర్ కేసులు…
ఆర్టీఐ సమాచారం ప్రకారం, నెలకు సగటున సుమారు 83 కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఆసుపత్రుల వారీగా నమోదైన వివరాలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యధికంగా 4,860 కేసులు నమోదు కాగా, 158 మంది మరణించారు. మార్చి 2026 వరకు అందిన డేటా ప్రకారం నెలకు సగటున 65 కేసులు నమోదవుతున్నాయి.
ఇక సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో మొత్తం కేసుల వివరాలు వెల్లడించనప్పటికీ, అత్యధికంగా 393 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (DSCI)లో 1,613 కేసులు నమోదు కాగా, 354 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 351 మంది మహిళలు ఉండగా, 2021లో ఇద్దరు చిన్నారులకు సైతం ఈ వ్యాధి నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 108 కేసులు నమోదు కాగా, 8 మంది మరణించారు. వీరిలో 47 మంది మహిళలు ఉన్నారు.