వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం చేపట్టబోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది…కేంద్రం, ఈసీ కుమ్మక్కై ఓటర్ల తొలగింపు మొదలుపెడుతున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈసీ సాయంతో త్వరలో మొదలయ్యే ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో అసలు ఓటర్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీహార్ లో బీజేపీ సాగించిన ఆటలు బెంగాల్లో మాత్రం సాగవని మమత తేల్చిచెప్పేశారు. బెంగాల్లో తనను లేదా తన ప్రజలను లక్ష్యంగా చేసుకుంటే దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి మొత్తం దేశాన్ని కదిలిస్తానని మమత బిజెపీని హెచ్చరించారు.
బెంగాల్లో మీరు నన్ను లక్ష్యంగా చేసుకుని, నా ప్రజలపై జరిగే ఏదైనా దాడిని వ్యక్తిగత దాడిగా భావిస్తే, తాను మొత్తం దేశాన్ని కదిలిస్తానంటూ మమత వ్యాఖ్యానిచారు. ఎన్నికల తర్వాత తాను మొత్తం దేశాన్ని పర్యటిస్తానన్నారు. ఇవాళ బొంగావ్లో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వ్యతిరేక ర్యాలీలో ప్రసంగిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాలో ఒక్క పేరును కూడా తొలగించే అధికారం లేదన్నారు. దీనిపై భయపడొద్దంటూ ప్రజలకు హామీ ఇచ్చారు….రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు మూడేళ్లు పడుతుందని, గతంలో 2002లో ఓటర్ల జాబితాల్ని సవరించారని మమత తెలిపారు. తాము ఎస్ఐఆర్ ను వ్యతిరేకించడం లేదని, కానీ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాస్తవ ఓటర్లను తొలగించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ ఆఫీసులో ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని, ఈసీ దాన్ని ఖరారు చేస్తుందని మమత ఆరోపించారు. ఈసీ నిష్పాక్షికంగా ఉండాలని, బీజేపీ కమిషన్ గా ఉండరాదన్నారు..