హైదరాబాద్, శామీర్‌పేట: మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్లో బాంబు పెట్టినట్లు ఏవోకు మెయిల్ ద్వారా దుండగులు బెదిరించారు. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ మెయిల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేయడంతో పాటు జిల్లా కలెక్టర్‌ను హత్య చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్త వెలుగులోకి రాగానే కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి చర్చించుకోవడం కనిపించింది.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే జిల్లా కలెక్టర్ గౌతంతో పాటు అదనపు కలెక్టర్‌ను కలిసి సమీక్ష నిర్వహించారు..