ఆయిల్ ఫామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంట …ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..

ఆయిల్ ఫామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంట
ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్

చింతపల్లి……..
నల్లగొండ జిల్లా ఉద్యానవన (హార్టికల్చర్) శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం చింతపల్లి మండలం..

గడియ గౌరారం X రోడ్ వద్ద రైతు అల్వాల యాదయ్య పొలంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తోందన్నారు. వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడంతో పాటు రైతులకు స్థిరమైన, అధిక ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ ఫామ్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలం పాటు నిరంతర ఆదాయం లభిస్తుందని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. నాణ్యమైన మొక్కల పంపిణీ, సాంకేతిక సలహాలు, సాగు నిర్వహణలో అవసరమైన మార్గదర్శకాలను ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. నీటి వనరులు ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలపడతారని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూనే, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, సాగునీటి సౌకర్యాల మెరుగుదల, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో కూడా వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ అవకాశాలు ఉన్న ప్రత్యామ్నాయ పంటలను కూడా రైతులు సాగు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల గిరి, చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరినాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.