ఎంఎల్సీ తీన్మాన్ మల్లన్న ఆరోపణలు, విమర్శలపై ఎదురుదాడి మొదలైంది. బీసీ నేతను అని చెప్పుకుని సొంత పార్టీ, ప్రభుత్వాన్నే ఇంతకాలం ఆరోపణలు, విమర్శలతో తీన్మార్ ఇరుకునపెడుతున్న విషయం తెలిసిందే..డైరెక్టుగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయాలనే తీన్మార్ రెగ్యులర్ గా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో బాగా వివాదాస్పమైన జీవో 29 రద్దుపైన తీన్మార్(Teenmar Mallanna) తన నోటికొచ్చినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంఎల్సీనే జీవో 29ని తప్పుపట్టడంతో ప్రతిపక్షాలు మరింతగా రెచ్చిపోయాయి. కాంగ్రెస్(Congress MLC ) ఎంఎల్సీ అయ్యుండీ సొంత పార్టీతో పాటు ప్రభుత్వంపై మల్లన్న ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే బీసీ(BC Leader)నేత అన్న ఒకే కారణంతో పార్టీలోని సీనియర్లలో ఎవరూ మల్లన్న వ్యవహారాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలోనే పార్టీలోని కొందరు యువనేతలు తీన్మార్ వ్యవహారంపై ఎదురుదాడికి దిగారు. రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనీల్, మెట్టుసాయికుమార్ మీడియాతో మాట్లాడుతు తీన్మార్ వ్యవహారాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత అన్న ఒకే ఒక్క కారణంతో ఇంతకాలం తీన్మార్ వ్యవహారశైలిని భరించినట్లు చెప్పారు. తన ఆరోపణలు, విమర్శల ద్వారా బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్(Central Minster Bandi Sanjay) తో కుమ్మకైనట్లు అర్ధమవుతోందన్నారు. తీన్మార్ ఎంఎల్సీ అయ్యింది కాంగ్రెస్ పార్టీ వల్లే అన్న విషయాన్ని మరచిపోకూడదని హెచ్చరించారు. తాను కూడా బీసీ కోటాలోనే రాజ్యసభ ఎంపీ అయినట్లుగా అనీల్ చెప్పారు. పార్టీలోని నేతలందరు మద్దతిస్తేనే తాను ఎంపీ అయిన విషయాన్ని తాను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు. అలాగే పార్టీ నేతలంతా కష్టపడితేనే తాను ఎంఎల్సీ అయిన విషయాన్ని తీన్మార్ ఎప్పటికీ మరచిపోకూడదని హితవు పలికారు. పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి, అందరు కష్టపడి పనిచేస్తేనే ఎంఎల్సీ అయిన తీన్మార్ అదే పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శిస్తు, ఆరోపణలు చేస్తుంటే తాము చూస్తు ఊరుకోబోమని గట్టిగానే హెచ్చరించారు.
తీరు మార్చుకోకపోతే సమయం, సందర్భం వచ్చినపుడు పార్టీ తీన్మార్ మల్లన్నపై యాక్షన్ తీసుకోవటం తథ్యమని కూడా చెప్పారు. పరిస్ధితి అంతవరకు తెచ్చుకోకుండా ఉంటేనే మల్లన్నకు చాలా మంచిదన్నారు. జీవో 29 రద్దు చేయకపోతే బీసీ అభ్యర్ధులకు తీరని నష్టం వస్తుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు చేసినట్లుగానే మల్లన్న కూడా ఆరోపణలు చేయటం చాలా విచిత్రంగా ఉందన్నారు. పరీక్షలు అయిన తర్వాత టీజీపీఎస్సీ(TGPSC) రిలీజ్ చేసిన వివరాల ప్రకారం మెయిన్స్ లో బీసీల పార్టిసిపేషన్ 57 శాతంగా తేలినట్లు అనీల్ చెప్పారు. అదే జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించి ఉంటే బీసీల పార్టిసేపేషన్ 39 శాతంగా మాత్రమే ఉండేదని చెప్పారు. జీవో 29 వల్ల బీసీలకు మంచి జరిగిందా ? లేకపోతే జీవో 55 వల్ల బీసీలకు మంచి జరిగేదా అని తీన్మార్ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ చేసిన యాగీవల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, పార్టీకి ఇబ్బందులు తెచ్చినందుకు తీన్మార్ ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అనుకుంటే ఎంఎల్సీకి, పార్టీకి రాజీనామా చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవచ్చని కూడా సూచించారు.
మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్మార్ ఇంతకాలం చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు పార్టీలోని యువనేతలతోనే సీనియర్లు చెక్ పెట్టేపని మొదలుపెట్టారు. మామూలుగా తీన్మార్ ఆరోపణలు, విమర్శలపై సీనియర్లు ఎప్పుడో ఎదురుదాడి మొదలుపెట్టేవారే. కాని తీన్మార్ విషయంలో ఎందుకనో సంయమనం వహించారు. అయితే దాన్ని ఎంఎల్సీ అలుసుగా తీసుకుని బహిరంగ వేదికలతో పాటు తన సొంత యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోతున్నారు. ఇపుడు యువనేతలు మొదలుపెట్టారు కదా మిగిలిన వాళ్ళు కూడ అందుకునే అవకాశాలున్నాయి. పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే సీనియర్లు, జూనియర్ల దెబ్బకు తీన్మార్ తన పద్దతిని అయినా మార్చుకోవాలి లేదా పార్టీలో నుండి బయటకు అయినా రావాల్సిందే. మరి ఏది ముందు జరుగుతుందో చూడాల్సిందే.
పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ…
ఓ సామాజిక వర్గంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. పార్టీకే కాకుండా అదే సామాజిక వర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వస్తుందా అనే అభిప్రాయం లో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు..
నిత్యం కాంగ్రెస్ పార్టీపై కాకుండా విమర్శలు గుప్పించడం, ఆ సామాజిక వర్గంపై ఆయనకున్న వ్యతిరేకతను పార్టీకి నష్టం వాటిల్లుతున్నట్లుగా పలువురు సీనియర్లు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం..
రెడ్డి కులస్తుల బహిరంగ విమర్శలు..
తీన్మార్ మల్లన్న కి వ్యక్తిగతంగా నాయకులు పై విమర్శలు ఉంటే ఆ వ్యక్తుల పేర్లుతో విమర్శించాలే తప్ప మొత్తం కులాన్ని విమర్శించటం ఏమిటంటే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు… నిజానికి ఓ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు ఆ కులం మొత్తాన్నిది కాదనేది ప్రతి ఒక్కరి వాదన.. దాన్ని పరిగణంలో తీసుకోకుండా ఒక సామాజిక వర్గంపై, నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు బహిర్గతంగానే తీన్మార్ మల్లన్న పై విమర్శలు గుప్పిస్తున్నారు…..
అసలు బీసీల్లో తీన్మార్ మల్లన్నది ఏ కులం..!?
బీసీల మొత్తానికి ఆయనే రాజు మంత్రిగా వ్యవహరిస్తున్నట్లుగా, ఆయన ధోరణి ఉన్నదని పలువురు విమర్శలు ఇప్పిస్తున్నారు… అసలు ఓ సామాజిక వర్గాన్ని విమర్శించేటప్పుడు ఆయన సామాజిక వర్గం ఎంత మంది ఉన్నారో కూడా ఆలోచించాలి… బీసీలు అంటే ఇంకా చాలా కులాలు ఉన్నాయని,, ఆయన ఒక్కడే బీసీ లీడర్ గా ఎదిగే ఆలోచనలో భ్రమల్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలువురు బీసీ నేతలు ట్రోల్ చేస్తున్నారు..