కేవలం 24 గంటల్లోనే 300 మి.మీ నుండి 380 మి.మీ వరకు అత్యంత భారీ వర్షపాతం..!

మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఈ వరద ధాటికి ఇప్పటివరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది..పలుచోట్ల రైల్వే ట్రాక్స్ తెగిపోయాయి. ఈ భారీ వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం 24 గంటల్లోనే 300 మి.మీ నుండి 380 మి.మీ వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల మంఖుర్ద్ ప్రాంతంలో ఇళ్లు కూలిపోవడం, చెట్లు పడిపోవడం వంటి ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, రైలు సర్వీసులు కొండచరియలు విరిగిపడటం వల్ల నిలిచిపోయాయి.
భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం ప్రతి ఏటా కొద్దిపాటి భారీ వర్షాలకే ఇలా చెరువులా మారడానికి ప్రకృతితో పాటు మానవ తప్పిదాలు, భౌగోళిక పరిస్థితులు కూడా ప్రధాన కారణాలు. ఆ కారణాలు ఏమిటో పరిశీలిద్దాము.

తీవ్రమైన వాతావరణ మార్పులు

గతంలో వర్షాలు వర్షాకాలం మొత్తం సమానంగా కురిసేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల, నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 2-3 రోజుల్లోనే అత్యంత తీవ్రమైన రూపంలో కురుస్తోంది. ఇంత భారీ నీటిని ఒకేసారి తట్టుకునే శక్తి నగర వ్యవస్థకు ఉండటం లేదు.

సముద్రపు పోటు

ముంబై మూడు వైపులా సముద్రం ఉన్న తీరప్రాంత నగరం. వర్షం పడే సమయంలోనే సముద్రంలో ‘హై టైడ్’ (పెద్ద అలలు రావడం) ఏర్పడితే, నగరంలోని డ్రైనేజీ ద్వారాలను మూసివేయాల్సి వస్తుంది. లేదంటే సముద్రపు నీరు నగరంలోకి వచ్చేస్తుంది. ఇలా గేట్లు మూసేయడం వల్ల కురిసిన వర్షపు నీరు సముద్రంలోకి వెళ్లలేక నగర వీధుల్లోనే నిలిచిపోతుంది.