నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 10 – 01 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ఏకాదశి* ఉ9.45 వరకు,
నక్షత్రం : *కృత్తిక* మ1.41 వరకు,
యోగం : *శుభం* మ2.58 వరకు,
కరణం : *భద్ర* ఉ9.45 వరకు
తదుపరి *బవ* రా8.46 వరకు,

వర్జ్యం : *తె4.52 – 6.24*,
దుర్ముహూర్తము : *ఉ8.49 – 9.33*,
మరల *మ12.29 – 1.13*,
అమృతకాలం : *ఉ11.26 – 12.56*,
రాహుకాలం : *ఉ10.30 – 12.00*,
యమగండం : *మ3.00 – 4.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.38,

*_నేటి విశేషం_*

*ముక్కోటి ఏకాదశి/వైకుంఠ ఏకాదశి*
కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి…
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు.

సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.

శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి.

పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు.
ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

*ముక్కోటి ఏకాదశి* :-
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు , దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం.
కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా , ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, (నిహితం గుహాయాం విభ్రాజతే).
అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి , ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే , ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి , పూజ – జపం – ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం.
పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు , చెవులు , మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు , చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం , ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని , జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు.
అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

స్వస్తి🙏☘️

*_🌿శుభమస్తు🌿_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏