అమెరికాలో జింక అడ్డం వచ్చి రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడు మృతి..ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..!

అమెరికాలో జింక అడ్డం వచ్చి రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించిన మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (25)

కారులో ప్రయాణిస్తుండగా జింక అడ్డం రావడంతో దాన్ని ఢీకొట్టి ఆగిపోయిన సాయితేజ

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన వాహనాలు సాయితేజ కారును ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు

ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాయితేజ మృతి చెందినట్లు ధృవీకరించిన డాక్టర్లు

వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించానని చెప్పి, ఇంతలోనే అతని మరణ వార్త వినడంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో న్యూయార్క్ స్టేట్ త్రూవే (ఇంటర్‌స్టేట్ 90) పై కనాజోహారీ సమీపంలో సాయితేజ వాహనానికి అకస్మాత్తుగా ఒక జింక అడ్డువచ్చింది. జింకను ఢీకొట్టడంతో సాయితేజ కారు నిలిచిపోయింది. కొద్ది క్షణాల్లోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక సరకు రవాణా వ్యాన్ (ట్రక్కు) ఆగి ఉన్న సాయితేజ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి మరో రెండు వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం నాలుగు వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి…తీవ్రంగా గాయపడిన సాయితేజను పోలీసులు సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో సాయితేజ కారులో ఉన్న మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడటంతో హెలికాప్టర్ ద్వారా అల్బానీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కార్గో వ్యాన్‌లోని మరో ప్రయాణికుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా త్రూవేపై ఎగ్జిట్ 28, 29 మధ్య తూర్పు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేసిన పోలీసులు, గురువారం తెల్లవారుజామున 1:15 గంటలకు తిరిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మునుగోడుకు చెందిన ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడైన సాయితేజ మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ స్టేట్ పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.