భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం…!

భారత్, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నవంబర్ 22, 23 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ ఏడాది మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, సాంకేతికత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి…బాలేంద్ర షా పర్యటనలో ప్రధాన ఘట్టం భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే ద్వైపాక్షిక సమావేశం. నవంబర్ 23న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల ప్రధానులు సమావేశమవుతారు. భారత్‌-నేపాల్ సంబంధాల పూర్తి స్థాయి అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి భాగస్వామ్యం, ఇంధనం, జలవనరులు, రైల్వేలు, రోడ్డు మార్గాలు, విమానయాన అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, క్రీడా రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునే అవకాశాలపైనా చర్చించనున్నారు. చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు (MoUs), ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పత్రాల మార్పిడి జరగనుంది. అనంతరం మోదీ, బాలేంద్ర షా సంయుక్తంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు…ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని సమీక్షించడంతో పాటు, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, బాలేన్ షా అభిప్రాయాల్ని పంచుకోనున్నారు. గతంలో 2023లో అప్పటి నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భారతదేశంలో పర్యటించారు. ఆ తర్వాత నేపాల్ నుంచి ఒక ప్రధాన మంత్రి భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా నేపాల్ దేశంలో కొత్తగా ఎన్నికైన ఏ ప్రధాని అయినా తమ తొలి విదేశీ పర్యటన కోసం భారతదేశాన్నే ఎంచుకునే సంప్రదాయం ఉంది.

బాలేన్ షా మాత్రం అందుకు భిన్నంగా తొలుత ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ వెళ్లారు. అంతకుముందు 2024లో అప్పటి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా తన మొదటి విదేశీ పర్యటన కోసం చైనాను ఎంచుకున్నారు. అయితే తొలి ద్వైపాక్షిక పర్యటన కోసం మాత్రం బాలేన్- భారత్‌ను ఎంచుకోవడం సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాఠ్‌‌మాండూ మాజీ మేయర్ అయిన బాలేన్ షా యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రధానంగా అవినీతి రహిత పాలన, పరిపాలనలో జవాబుదారీతనం నినాదాలు ఆయనను అందలమెక్కించాయి. 2025 సెప్టెంబరులో రాజకీయ తిరుగుబాటు కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, 2026 మార్చిలో షా నేపాల్ ప్రధాని పగ్గాలు చేపట్టారు.

సరిహద్దు వివాదాలు, సున్నిత అంశాలకు పరిష్కారం?..
NEPAL PM TO MEET MODI

దక్షిణాసియాలో చైనా ఆర్థిక, మౌలిక సదుపాయాల విస్తరణ నేపథ్యంలో, భారత్ తన పొరుగుదేశాలతో సంబంధాల్ని బలోపేతం చేయాలనే ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని బలోపేతం చేసుకుంటోంది. అయితే 1950 నాటి శాంతి ఒప్పందం సవరణ, కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా సరిహద్దు వివాదాలు, 2022లో అగ్నిపథ్ పథకం వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్లలో నేపాలీ యువత నియామకాలు వంటి పలు అంశాలు ఇరు దేశాల మధ్య సున్నిత అంశాలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు అవసరం అన్న వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో ‘అన్ని అంశాలూ చర్చకు వస్తాయి. ఇది మాకు చాలా ముఖ్యమైన పర్యటన’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలేన్ షా పర్యటన కేవలం మర్యాదపూర్వక భేటీలకే పరిమితం కాకుండా- ఆర్థిక సహకారం, అభివృద్ధి ప్రాజెక్టులు, సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొత్త అవకాశాల్ని అందించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌-నేపాల్ మధ్య విమాన, రైల్వే కనెక్టివిటీకి ప్రాధాన్యత!

ఈ పర్యటనలో రవాణా అనుసంధానానికి సంబంధించిన అంశాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా నేపాల్‌కు అదనపు విమాన మార్గాలను కల్పించాలన్న దీర్ఘకాలిక ప్రతిపాదనపై చర్చలు జరిగే అవకాశం ఉంది. మహేంద్రనగర్, భైరహవా ప్రాంతాల మీదుగా భారత గగనతలాన్ని ఉపయోగించుకుని విమాన రాకపోకలు సాగించే మార్గాల కోసం నేపాల్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి భారత్‌తో చర్చలు జరపాలని నేపాల్ భావిస్తోంది. అలాగే అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైల్వే అనుసంధానం, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కూడా చర్చల్లో ప్రాధాన్యత పొందనున్నాయి. రెండు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడితే వాణిజ్యం, పర్యాటకం, ప్రజల రాకపోకలకు మరింత ఊతం లభించనుంది.

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు షా నవంబర్ 22, 23 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

“ఈ పర్యటన ఇరు దేశాల మధ్య జరిగే ఉన్నత స్థాయి సమావేశాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యత’ అనే విధానం కింద నేపాల్‌తో సంబంధాలకు భారతదేశం ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది,” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

లిపులేఖ్, లింపియాధుర మరియు కాలాపాని ప్రాంతాలపై ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా సరిహద్దు వివాదం ఉంది. ఈ భూభాగాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారతదేశం నిరంతరం వాదిస్తూ వస్తోంది.

భారత్-నేపాల్ సంబంధాలను బలోపేతం చేయడం, సహకారాన్ని విస్తరించడంపై షా పర్యటన దృష్టి సారిస్తుంది. అదే సమయంలో ఇరు దేశాధినేతలకు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకునేందుకు ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుంది