కాంగ్రెస్ హైకమాండ్​ నుంచి రాజగోపాల్​ రెడ్డికి ఫోన్…

Rajagopal Reddy

నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ నెల 23న తెలంగాణ కొత్త ఏఐసీసీ ఇం​ఛార్జ్​ సందీప్​తో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శి సూచించారు. రాజగోపాల్​ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఫోన్​కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజగోపాల్​ రెడ్డి, అనిరుధ్​ ​రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ తెలిపారు.

క్రమశిక్షణ చర్యల అంశంపై ఏఐసీసీ స్పందిస్తుంది

మరోవైపు రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ ​కుమార్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్​ రెడ్డి, అనిరుధ్​ ​రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోందని తెలిపారు. క్రమశిక్షణ చర్యల అంశంపై హైకమాండ్ స్పందిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ​పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని అన్నారు.

కొండా సురేఖ విషయంలో మొదటిసారి చర్యలు తీసుకోలేదన్న ఆయన, రెండు, మూడుసార్లు పరిశీలించిన తర్వాతనే చర్యలు తీసుకుందని వివరించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఒక్క బొట్టు కూడా వదులుకోబోమని మహేశ్​ కుమార్ గౌడ్ తెలిపారు. నీటి జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని వివరించారు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసే అవసరం లేదని ఆయన చెప్పారు.

రేపు హైదరాబాద్​కు ఏఐసీసీ ఇన్​ఛార్జి రాక

కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఏఐసీసీ కొత్తగా నియమించిన బి.ఎం.సందీప్‌ ఆదివారం(రేపు) హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. 22న గాంధీభవన్‌లో జరగనున్న పొలిటికల్ అఫైర్స్​ కమిటీ (పీఏసీ), ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ)ల ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొంటారు. 23వ తేదీన గాంధీభవన్‌లో ఉదయం మంత్రులతో, మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమై తిరిగి వెళ్లిపోతారు. మళ్లీ 27వ తేదీన నగరానికి వచ్చి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో నేరుగా మాట్లాడి జిల్లాలవారీగా పార్టీ కార్యక్రమాల వివరాలను బి.ఎం. సందీప్ తెలుసుకోనున్నారు.

ఇటీవలికాలంలో పార్టీని ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు వివరించాయి. పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించే నేతలను ఉపేక్షించవద్దని హైకమాండ్​ నుంచి కూడా గట్టిగా సూచనలు అందినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారిని గాంధీభవన్‌కు పిలిపించి నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని కొత్త ఇన్‌ఛార్జి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఇప్పటికే ఏఐసీసీకి నివేదికలు పంపినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరిపైనా కొత్త ఇన్‌ఛార్జి రాష్ట్ర ముఖ్యనేతలతో చర్చించిన తరవాత ఏఐసీసీకి నివేదిస్తారని, ఆ తరవాతే పార్టీపరంగా చర్యలు తీసుకుంటారని నేతలు చెబుతున్నారు.