ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతిని సాధించిందని ఇస్రో ఛైర్మన్ వీ నారాయణన్ అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 200కిపైగా కీలక మైలురాళ్లను అధిగమించామని తెలిపారు. బెంగళూరులో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లెవ్ 2025 (ESTIC-2025) కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ. 400 కోట్లతో మూడో లాంఛ్ ప్యాడ్‌ను తమిళనాడులో నిర్మించేందుకు ఆమోదం పొందామని వెల్లడించారు. ప్రయోగాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
“ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200కి పైగా కీలక మైలురాళ్లను సాధించాం. జనవరి 6న ఆదిత్య ఎల్ 1 మిషన్ నుంచి సేకరించిన 10 టెరాబైట్ల సాంకేతిక డేటాను విడుదల చేశాం. ఆ తర్వాత ఫిబ్రవరిలోనే మరికొంత డేటాను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు ఆదిత్య మిషన్ నుంచి దాదాపు 15 టెరాబైట్ల డేటాను ప్రచురించాం. తొలిసారిగా ఆర్బిట్ డాకింగ్ ప్రయోగం స్పేడెక్స్ను జనవరి 16న చేపట్టాం. గంటకు 28,400కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేశాం. ఆల్గారిథమ్స్, కెమెరాలుతో పాటు వివిధ వ్యవస్థలను ఉపయోగించి ఈ రెండు శాటిలైట్లను విజయవంతంగా డాకింగ్ చేశాం. ఫలితంగా ప్రపంచంలోనే స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. జనవరి 29న జీఎస్ఎల్వీ- ఎఫ్ 15 మిషన్ ప్రయోగించాం. ఇది శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేసిన వందో ప్రయోగం.