ఢిల్లీ పేలుడుకు బాధ్యులను చట్టం ముందుకు తీసుకువస్తామని భూటాన్‌లో ప్రధాని ప్రకటన..

దేశ రాజధాని దిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూాటాన్ పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీ, ఆ దేశ రాజధాని థింఫులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. సోమవారం సాయంత్రం దిల్లీలో జరిగిన భయానక ఘటన ప్రతి భారతీయుడిని విషాదంలో ముంచేసింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను. దేశం మొత్తం ఈ కష్ట సమయంలో వారి పక్కనే ఉంది. సోమవారం రాత్రంతా దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులో ఉన్నా. పలు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడిస్తారు. కుట్రదారులను వదిలిపెట్టం. అమాయకుల ప్రాణాలు తీసిన వారందరికీ తగిన శిక్ష తప్పదు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు..