రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు..

రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఈరోజు కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడినట్టు పేర్కొంది.

ఈనెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.