మీ మనసులో ఒక సంఖ్యను అనుకోండి.దాన్ని వెంటనే రెట్టింపు చేయండి! మీ లాభాలనూ, వృద్ధి అంచనాలనూ రెట్టింపు చేసుకోండి. ..సీఎం రేవంత్ రెడ్డి..

Revanth Reddy Delhi Speech.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న దేశ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన భరోసా ఇచ్చారు. “తెలంగాణలో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో మీ మనసులో ఒక సంఖ్యను అనుకోండి.. దాన్ని వెంటనే రెట్టింపు చేయండి! మీ లాభాలనూ, వృద్ధి అంచనాలనూ రెట్టింపు చేసుకోండి. మీ పెట్టుబడులకు సెక్యూరిటీ కల్పించి, అవి వేగంగా వృద్ధి చెందేలా చూసే బాధ్యత నాది.. మీ పెట్టుబడులకు నేను సంరక్షకుడిగా ఉంటా” అని సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కర్టెన్ రైజర్ ఈవెంట్‌లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని సరికొత్త ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న మెగా ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానించారు.

హైదరాబాద్ డీఎన్‌ఏలోనే గ్లోబల్ విజన్ ఉంది
హైదరాబాద్‌కు 400 ఏళ్ల ఘనమైన వాణిజ్య చరిత్ర ఉందని సీఎం గుర్తుచేశారు. ఆనాటి చార్మినార్ వీధుల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం నుంచి నేటి గ్లోబల్ లీడర్ల వరకు భాగ్యనగరం ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి గ్లోబల్ లీడర్లను అందించిన ఘనత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌దేనని కొనియాడారు.

దేశ ఆర్థిక పురోగతికి బాటలు వేసిన దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల సేవలను స్మరించుకుంటూ.. దేశ సంస్కరణలకు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ గడ్డ ఎప్పుడూ పెట్టుబడులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా గత 30 ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధికి పాలకులు అందించిన నిరంతర మద్దతును ఆయన శ్లాఘించారు.