మద్యం మత్తులో లారీ బీభత్సం..ముగ్గురు మహిళల దుర్మరణం..!

మద్యం మత్తులో లారీ బీభత్సం

ముగ్గురు మహిళల దుర్మరణం

కవిటి మండలం జమేదారిపుట్టుగ సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. OR07P4901 నంబరు గల ఖాళీ లారీని మద్యం మత్తులో నడుపుతున్న డ్రైవర్ అదుపుతప్పి, ఎదురుగా వెళ్తున్న OD07 BA9464 నంబరు గల మినీ లగేజ్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఢీకొట్టిన తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఇచ్చాపురం ఎఎస్‌పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52), గుజ్జిపుట్టుగకు చెందిన మురపాల పార్వతి (50), రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ (60) ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని ఇచ్చాపురం సీహెచ్‌సీకి తరలించారు. కంచిలి ఆదివారం సంత నుంచి పనసకాయల లోడ్‌తో బరంపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.