తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం..పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం దిశగా సర్కారు అడుగులు ..!?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు మెుదలు పెట్టింది.జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా స్కూల్ విద్యను 12వ తరగతి వరకు ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి 2026-27 విద్యాసంవత్సరం నుంచే 11 తరగతి బోధన ప్రారంభిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కొత్త విద్యావిధానం అమలులోకి వస్తే పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై జూనియర్ కాలేజీలకు వెళ్లకుండా అదే పాఠశాలలో 11 వ తరగతి(ప్లస్ టూ ఎడ్యుకేషన్ సిస్టమ్)చదవనున్నారు. ఈ విధానం సక్సెస్ అయితే తెలంగాణలో పాఠశాల, ఇంటర్ విద్యకు ఒకే బోర్డు ఏండనుంది.ఇంకా చెప్పాలంటే ఇంటర్ బోర్డు విలీనం కానుంది అని తెలుస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో ప్లస్ టూ విద్యావిధానం అమలుకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది…

ఇంటర్‌ విద్యా చట్టం రద్దు : స్కూల్ ఎడ్యుకేషన్​లో ఇంటర్‌విద్యను విలీనం చేయాలంటే ఆ రెండు చట్టాలను కలిపి ఒకదాన్ని రూపొందించాల్సి ఉంటుంది. అందుకు పాఠశాల విద్యకు సంబంధించి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్టు (1982) సవరించాలని, తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ విద్యా చట్టాన్ని (1971) రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతమున్నటువంటి ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్‌ఎస్‌సీ బోర్డు), ఇంటర్‌మీడియట్‌ విద్యామండలి (ఇంటర్‌బోర్డు)ని కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ప్రతి రాష్ట్రంలో పది, ఇంటర్‌కు ఒకే బోర్డు ఉండాలని గత ఏడాది జూన్ నెలలో సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కామన్ బోర్డుగా మారితే జూనియర్‌ కాలేజీలు సైతం పాఠశాల విద్య పరిధిలోకి రానున్నాయి.

ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలు ఇవే : టెన్త్​లో ఏటా 5 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వీరంతా ఇంటర్, తత్సమాన విద్యలో చేరట్లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు పైచదువులకు దూరమవుతున్నారు. పాఠశాల విద్య పరిధిలోకి ఇంటర్‌ వస్తే డ్రాపౌట్లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల విద్యలోకి ఇంటర్మీడియట్​ను తీసుకొస్తే సమగ్ర శిక్షా, పీఎం శ్రీ తదితర పథకాల కింద నిధులను పొందొచ్చు. మౌలిక సదుపాయాలను పెంచుకోవచ్చు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ల్యాబ్‌లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జూనియర్‌ కాలేజీల్లో సైన్స్‌ ల్యాబ్‌లున్నాయి. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు వేర్వేరుగా ఉండటం వల్ల వేర్వేరు ప్రయోగశాలల అవసరం ఉండదు. లైబ్రరీలను, ఇతర సౌకర్యాలను సమర్థంగా వాడుకోవచ్చు. పాఠశాల, ఇంటర్‌కు ఒకే టీచర్లు ఉండటం కారణంగా వారి బోధనకు విద్యార్థులు అలవాటుపడతారు. ఏ విద్యార్థి విద్యా సామర్థ్యం ఏమిటో టీచర్లకు సులభంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.