అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న క్రూయిజ్ నౌకలో జరిగిన మరణాలకు హంటా వైరస్‌తో సంబంధం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించింది. ఐదు కేసులను గుర్తించగా మరో ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఈ వైరస్ ఆండెస్ స్ట్రెయిన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని, మరిన్ని ఇన్ఫెక్షన్లు బయటపడే అవకాశం ఉందని WHO తెలిపింది. అయితే, దీనివల్ల ప్రజారోగ్యానికి విస్తృత ప్రమాదం చాలా తక్కువగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం జరిగిన పత్రికా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఈ మేరకు వివరించారు.,,..
“ఇది ఒక తీవ్రమైన ఘటన అయినప్పటికీ, ప్రజారోగ్య ప్రమాదం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది కేసులు వెలుగులోకి వచ్చాయి. వారిలో ముగ్గురు మరణించగా, ఐదు కేసులు ధ్రువీకరించారు. మరో ముగ్గురు అనుమానితులు ఉన్నారు. హంటావైరస్ వ్యాప్తి కాలం ఆరు వారాల వరకు ఉండవచ్చు కాబట్టి, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది” అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. డచ్ జెండా కలిగిన ‘హోండియస్’ నౌకలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ప్రయాణికుల గురించి యునైటెడ్ కింగ్డమ్ తమ సంస్థను అప్రమత్తం చేసిందని వెల్లడించారు. ఈ నౌక ప్రస్తుతం కేప్ వెర్డే నుంచి స్పెయిన్‌లోని టెనెరిఫేకు ప్రయాణిస్తోంది…
వైరస్‌పై వివరణ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ
అంతకుముందు ఈ వైరస్ నౌకలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. ఎంవీ హోండియస్ అనే డచ్ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరింది. ఏప్రిల్ 6న ఓ డచ్ పౌరుడు తలనొప్పి, జ్వరం లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పింది. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి నౌకలోనే ఆయన మరణించారని వివరించింది. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అదే నౌకలో ప్రయాణిస్తున్న జర్మన్ మహిళ కూడా న్యుమోనియా లక్షణాలతో మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది…
మనిషి నుంచి మనిషికి వ్యాప్తి తక్కువే..
ప్రస్తుతం నౌకలో లక్షణాలతో ఉన్న ప్రయాణికులు లేదా సిబ్బంది ఎవరూ లేరని ఆమె తెలిపారు. గతంలో ఆండీస్ వైరస్ వ్యాప్తి సందర్భాల్లో మనిషి నుంచి మనిషికి వ్యాప్తి ఎక్కువగా సన్నిహిత సంబంధాల ద్వారానే జరిగిందని అన్నారు. WHO అత్యవసర ఆరోగ్య కార్యక్రమంలోని అలర్ట్ అండ్ రెస్పాన్స్ కోఆర్డినేషన్ విభాగం డైరెక్టర్ అబిద్ రహమాన్ మహమ్మద్ మాట్లాడుతూ 2018-2019లో అర్జెంటీనాలో ఇలాంటి పరిస్థితిని చూశామని తెలిపారు. అప్పట్లో ఈ తరహా లక్షణాలతో ఉన్న వ్యక్తి ఓ సామాజిక సమావేశానికి హాజరుకావడంతో అనేక మందికి వైరస్ సోకిందని, ప్రస్తుతం కూడా పరిమిత స్థలంలో, సన్నిహితంగా ఎక్కువసేపు గడపడం వల్ల క్లస్టర్ కేసులు కనిపిస్తున్నాయని చెప్పారు. పబ్లిక్ హెల్త్ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి చర్యలను కచ్చితంగా అమలు చేస్తే ఈ వ్యాప్తి చెయిన్‌ను విచ్ఛిన్నం చేయవచ్చని,
ఇది పెద్ద ఎపిడెమిక్‌గా మారుతుందని భావించడం లేదని తెలిపారు. ఇది ప్రస్తుతం ఒక నిర్దిష్ట పరిమిత వాతావరణంలో జరిగిన వ్యాప్తి మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
WHO నిపుణులు తెలిపిన ప్రకారం ప్రస్తుతం పరిస్థితి అర్జెంటీనా వ్యాప్తిని పోలి ఉన్నప్పటికీ, ఇది భారీ మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ మహమ్మద్ మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్ చర్యలతో వైరస్ వ్యాప్తి చెయిన్ ను నియంత్రించవచ్చని, ఇది పరిమిత స్థాయి వ్యాప్తిగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా వాన్ కెర్ఖోవ్ స్పందిస్తూ ఇది కరోనా వైరస్ కాదని, ఇది చాలా కాలంగా ఉన్న వేరే రకం వైరస్ అని తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న కోవిడ్ పరిస్థితితో దీనికి పోలిక లేదని, ఇది ఒక పరిమిత ప్రాంతంలో, ముఖ్యంగా నౌకలో కనిపిస్తున్న వ్యాప్తి మాత్రమే అని తెలిపారు. ఇది కోవిడ్‌లా వ్యాపించదని ఆమె స్పష్టం చేశారు.
మహమ్మారిగా మారే అవకాశం తక్కువ..
హంటా వైరస్, కోవిడ్-19 మధ్య ప్రధాన తేడా వైరస్ వ్యాప్తి విధానంలోనే ఉంది. హంటా వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. ముఖ్యంగా ఎలుకల మూత్రం, విసర్జనలు లేదా లాలాజలం ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. మరోవైపు కోవిడ్-19 అత్యంత వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే శ్వాసకోశ వైరస్ కావడం గమనార్హం. రెండు వైరస్లు కూడా తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. అయితే హంటా వైరస్ సాధారణంగా ఎక్కువ ప్రాణాంతకమై ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మనుషుల మధ్య సులభంగా వ్యాపించదు. కనుక మహమ్మారిగా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.