తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
భద్రాద్రి, మెదక్, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన
సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్లోనూ వర్షాలు
గంటకు 40 కి.మీ. కంటే తక్కువ వేగంతో ఈదురుగాలులు..
మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరాన్ని సాయంత్రం వరుణుడు పలకరించాడు. అక్టోబర్ 30 (శుక్రవారం) సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటివరకు వేడితో ఇబ్బందిపడిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది…ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడటంతో జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా మేడిపల్లి నుంచి (Hyderabad Heavy Rain) చెంగిచర్ల వరకు వాన తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఘట్కేసర్, పోచారం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఈసీఐఎల్, కుషాయిగూడ, నేరేడ్మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి..
అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆతదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.