డీపీఆర్ వచ్చేంతవరకు కూడా ఓపిక పట్టరా?.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.

డీపీఆర్ వచ్చేంతవరకు కూడా ఓపిక పట్టరా?.. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీకి చెందిన నేతలు మూసీ నిద్ర పేరిట పెద్ద డ్రామా చేశారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…. మూసీ నిద్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపించడం, ప్రభుత్వాల దృష్టికి తేవడం అని అన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఫోటో షూట్లు…కొత్త బెడ్లు…కొత్త బెడ్షీట్లు…దోమలు కుట్టకుండా కాళ్లకు సాక్స్ వేసుకుని నిద్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మూసీ పక్కనగానీ, బఫర్ జోన్లో కూడా నిద్ర చేయలేదన్నారు. మూసీకి ఎక్కడో దూరంగా నిద్ర చేస్తే కాలుష్యం, దుర్గంధం, దోమలు, ఈగలతో ప్రజలు పడుతున్న కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇంతకు కిషన్‌రెడ్డికి మురుగు వాసన వచ్చిందో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రారంభించి 20 ఏండ్లు అవుతున్నా పూర్తి కాలేదన్నారు. అక్కడి 13వేల మంది నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. సబర్మతికి లేని అభ్యంతరం మూసీకి ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఎంపీ బలరాం నాయక్, పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఎప్పుడు కష్టమొచ్చినా బీజేపీ రక్షణ కవచంలా నిలబడుతుందని అన్నారు. అనేక విషయాల్లో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు డీపీఆర్ వచ్చేంతవరకు కూడా ఓపిక పట్టరా? అని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నించారు. మూసీ నిద్ర పేరిట చిలిపి చేష్టలు చేస్తున్నారని అన్నారు. ‘చారుపే చర్చ’ కాదు…’మూసీ పే చర్చ’ చేయాలని కోరారు. మూడు నెలలపాటు నిద్ర చేస్తే అర్థమవుతుందంటూ సీఎం సూచించారనీ, 12 గంటలు నిద్ర చేస్తే ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. అక్కడికెళ్లి కేంద్ర మంత్రి ఏం సాధించారని అన్నారు. నిరాశ్రయులకు డబుల్‌బెడ్ రూమ్‌లు ఇస్తామన్నారు. గుజరాత్‌కు గులాములుగా మారి, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని విమర్శించారు. దక్షిణ భారతదేశం అభివృద్ధి కాకూడదా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల గుండా 150 కి.మీ దూరం ప్రవహిస్తున్నదని చెప్పారు. ఆ రైతులకు పంట పొలాలకు నీరు అందుతుందన్నారు. రానున్న కాలంలో ప్రళయాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారని చెప్పారు. దీంతో ప్రజలకు సురక్షితమైన హైదరాబాద్‌ను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ అవగాహన ఉందనీ, కాబట్టి తాము నిద్ర చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే మూసీ నిద్ర చేసిన కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి మంచి ప్లాన్ ఇవ్వాలని కోరారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లాగా కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పంపించబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందంటూ ప్రశ్నించగా.. అది బీఆర్ఎస్, బీజేపీ సృష్టిస్తున్న ప్రచారమేనని చెప్పారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరామనీ, ఆయన ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. లగచర్ల నిర్వాసితులకు భూమికి భూమి, భూమి అందుబాటులోని సమయంలో పైసలు ఇస్తామన్నారు. ఫార్మా కంపెనీకి భూసేకరణ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీ సీఎం అల్లుడు కోసమేనా? అన్న ప్రశ్నకు అది బీఆర్ఎస్ చేస్తున్న పుకార్లు అని ఎంపీ కొట్టిపారేశారు.